- క్యూర్ పరిధిలో అత్యంత పారదర్శకంగా ఇందిరమ్మ టవర్స్ లక్కీడ్రా
- 16 నియోజకవర్గాల్లో సుమారు 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా
- రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున ప్రక్రియ
- పేదలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచిత రిజిస్ట్రేషన్.
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హతే ప్రామాణికంగా, కులమతాలు , రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని స్పష్టం చేశారు. క్యూర్ ప్రాంతంలో తొలి విడతగా చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపునకు అత్యంత పారదర్శకంగా లక్కీడ్రా నిర్వహిస్తున్నామని తెలిపారు. మీడియా, అర్హులైన లబ్ధిదారుల సమక్షంలో లక్కీడ్రా నిర్వహిస్తూ, మొత్తం ప్రక్రియను అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం నాంపల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కోసం లక్కీడ్రా నిర్వహించారు. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్‌లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కేటాయింపునకు వెట్ గార్డెన్స్‌లో, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్‌దేవుపల్లి పరిధికి సంబంధించి లక్ష్మీగూడలో నిర్వహించిన లక్కీడ్రా కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని డ్రా తీశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈరోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున లక్కీడ్రా ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 480 ఫ్లాట్లకు 600 మంది లబ్ధిదారులను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తామని మంత్రి వివరించారు. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో తుది పరిశీలన నిర్వహిస్తారని, ఎంపికైన వారిలో ఎవరైనా అనర్హులుగా తేలితే మిగిలిన 120 మందిలోని అర్హులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ విధానం ద్వారా అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 13న కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేశారని మంత్రి గుర్తు చేశారు. అనంతరం రికార్డు సమయంలోనే 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి టెండర్లు పిలవడం, మరోవైపు లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీడ్రా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వానికి గొప్ప విజయమని అన్నారు. క్యూర్ పరిధిలో తొలి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, ఆయా నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం సెప్టెంబర్ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఇప్పటికే 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు విడతల్లో అందిస్తోందని, చివరి విడత బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయని వివరించారు. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసి, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. మరో పది రోజుల్లో రెండో విడత లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయ్యే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వానికి డబ్బు కూడబెట్టుకోవడం కంటే పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా సొంత ఇంటిని అందించడం ముఖ్యమని అన్నారు. ఎకరం రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్లు విలువ చేసే ప్రాంతాల్లోనూ పేద కుటుంబాలు గౌరవంగా జీవించాలి అని మంత్రి స్పష్టం చేశారు. ఇందిరమ్మ టవర్స్‌లో ఇల్లు పొందిన అర్హులైన లబ్ధిదారులకు ఒక్క పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని మంత్రి తెలిపారు. రిజిస్ట్రేషన్ అనంతరం పదేళ్ల తర్వాత అవసరాన్ని బట్టి ఇంటిని విక్రయించుకునే సదుపాయం ఉంటుందని చెప్పారు. అంతకుముందే ఏదైనా అత్యవసర అవసరం ఏర్పడితే, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను బ్యాంకులో కుదువ పెట్టుకుని రుణం పొందే అవకాశం కూడా ఉంటుందని వివరించారు.
లక్కీడ్రాలో ఇల్లు పొందిన ప్రతి లబ్ధిదారుడికి సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించి అందిస్తామని మంత్రి చెప్పారు. ఒక్కో ఇంటికి 17 నుంచి 20 గజాల అన్‌డివైడెడ్ షేర్ భూమి కూడా ఉంటుందని తెలిపారు.ప్రభుత్వం గుర్తించిన స్థలాల్లో అవసరాన్ని బట్టి 10 అంతస్తుల వరకు ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని, లిఫ్ట్‌లతో పాటు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. లక్కీడ్రా పూర్తయిన తర్వాత లబ్ధిదారుల తుది ఎంపిక జరుగుతుందని, అధికారుల పరిశీలన అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తారని మంత్రి తెలిపారు. ఆ తర్వాత కేవలం 3–4 రోజుల్లోనే టవర్స్ నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించుకునే అవకాశం కూడా ఉంటుందని మంత్రి తెలిపారు.
నాంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన లక్కీడ్రాలో తొలుత ఎస్సీ విభాగానికి కేటాయించిన 14 శాతం రిజర్వేషన్ ప్రకారం 67 ఫ్లాట్ల కోసం 288 మంది పేర్లతో కూడిన చీటీలను డ్రమ్ములో వేశారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, హౌసింగ్ ఎండీ వి.పి. గౌతమ్, కలెక్టర్ ప్రియాంక తదితర అధికారుల సమక్షంలో లబ్ధిదారులతోనే డ్రా తీయించారు. ఎస్సీ విభాగంలో తొలి ఫ్లాట్‌కు మరకాల కృష్ణవేణి ఎంపిక కాగా, అనంతరం టి.అనిత, మంగనూరి అనసూయ, ఎం.కుమారి, శైలజాకుమారి వరుసగా ఫ్లాట్లను లక్కీడ్రా ద్వారా పొందారు. ప్రతి నియోజకవర్గంలో సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎస్సీలకు – 14 శాతం, ఎస్టీలకు – 5 శాతం, బీసీలకు – 16 శాతం, దివ్యాంగులకు – 5 శాతం పారిశుధ్య కార్మికులు, నాలుగో తరగతి ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు – 10 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు వివరించారు. ఈ ఫ్లాట్లలో మొత్తం 50 శాతం రిజర్వేషన్లు ఉండగా, మొత్తంగా మహిళలకు 30 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.