- ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పే విధానాన్ని సహించేది లేదు
- పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు
- రెవెన్యూ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరగాలి
- ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ : తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ల పనితీరులో తప్పనిసరిగా స్పష్టమైన మార్పు కనిపించాలని, ప్రజలను అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిప్పే విధానానికి స్వస్తి పలకాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూములకు సంబంధించిన ప్రతి దరఖాస్తును సానుకూల దృక్పథంతో పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని మంత్రి స్పష్టం చేశారు. చట్టంలోని నిబంధనలను పాటిస్తూనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని, రెవెన్యూ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా అధికారులు పనిచేయాలని అన్నారు. శనివారం సూర్యాపేట సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే, గృహ నిర్మాణ శాఖల సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు.
45 దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచడంపై వివరణ
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు తహసీల్దార్ లాగిన్‌లో భూములకు సంబంధించిన 45 దరఖాస్తులు ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉండటాన్ని మంత్రి ప్రస్తావించారు. ఈ విషయంపై సంబంధిత తహసీల్దార్‌ను వివరణ కోరాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ భూ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత వాటిని రోజుల తరబడి పెండింగ్‌లో ఉంచడం సరికాదని, ప్రతి దరఖాస్తుపై అధికారులు బాధ్యత తీసుకుని నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు.
ప్రజలను ఇబ్బంది పెట్టే విధానాలకు చోటు లేదు
తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు తమ కార్యాలయాలకు వచ్చే ప్రజల సమస్యలను సేవా దృక్పథంతో పరిష్కరించాలని మంత్రి అన్నారు. అవసరం లేని పత్రాలు, ప్రక్రియల పేరుతో ప్రజలను తిప్పుకోవడం, చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి కూడా రోజుల తరబడి వేచి ఉండేలా చేయడం వంటి విధానాలను నివారించాలని స్పష్టం చేశారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి.. ప్రజల సమస్యలను పరిష్కరించాలి.. రెవెన్యూ కార్యాలయాలకు వచ్చిన వ్యక్తి సంతృప్తితో తిరిగి వెళ్లేలా చూడాలి అని మంత్రి సూచించారు.
రీ-సర్వేలోనూ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ
రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత చేపట్టిన రీ-సర్వేకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. డిసెంబర్‌లో రెండో విడత రీ-సర్వే చేపట్టేందుకు ఇప్పటి నుంచే అధికారులు సిద్ధం కావాలని సూచించారు. తొలి విడతలో రీ-సర్వే చేపడుతున్న 70 గ్రామాల్లో సర్వేను పారదర్శకంగా నిర్వహించి గ్రామ సరిహద్దులను పక్కాగా నిర్ధారించాలని ఆదేశించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో రీ-సర్వేను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని, ఆర్డీవోలు, తహసీల్దార్లు కూడా గ్రామసభలకు హాజరై పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. సర్వే నిర్వహించిన రోజే భూ రికార్డులను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని, సర్వేయర్ల కొరత ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే పక్క మండలాల నుంచి సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని అన్నారు. విధులకు హాజరుకాని లైసెన్స్డ్ సర్వేయర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే వారి లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల సమస్యలు 15 రోజుల్లో పరిష్కరించాలి
ఇందిరమ్మ ఇళ్ల తొలి విడతలో ఉన్న ఎల్-1, ఎల్-2, ఎల్-3 సమస్యలను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా 15 రోజుల్లో ఎల్-3 సమస్యలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. మొదటి విడతలో అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను దసరాలోపు పూర్తి చేయాలని, గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో వివిధ దశల్లో నిలిచిపోయిన నిర్మాణాలను గుర్తించి 15 రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అన్ని పన్నులు, రవాణా చార్జీలు కలుపుకొని రూ.230కే సిమెంట్ బస్తా అందించేలా సిమెంట్ కంపెనీలతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇళ్లకు సమీపంలో ఎక్కడ ఇసుక లభిస్తే అక్కడి నుంచి అందించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. నల్గొండ పట్టణంలో ఇందిరమ్మ టవర్స్ కింద 500 గృహాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇంటి పట్టాల పంపిణీ వేగవంతం చేయాలి
గతంలో ఇంటి పట్టాల కోసం భూములను గుర్తించినప్పటికీ ఇంకా పంపిణీ చేయని వాటిని వెంటనే గుర్తించి జాబితా రూపొందించాలని, అర్హులైన లబ్ధిదారులకు పట్టాల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రెవెన్యూ, అటవీ భూములకు సంబంధించిన సమస్యలను కూడా చట్టానికి లోబడి శాశ్వతంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమస్యలకు పరిష్కారం చూపడమే రెవెన్యూ అధికారుల ప్రధాన బాధ్యతగా ఉండాలని అన్నారు.