హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ (G.O.Rt.No.679) చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు (కేకే) నేతృత్వంలో కమిటీ ప్రతినిధి బృందం నేడు సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సుదీర్ఘంగా సమావేశమైంది. ఈ కీలక సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎమ్. కోదండరామ్, కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, మరియు మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్ పాల్గొన్నారు. ఇటీవల అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) వేదికగా 13,000 మందికి పైగా ఉద్యమకారులు, వివిధ జేఏసీలు, ప్రజాసంఘాలు, కవులు, కళాకారులు, మరియు మహిళా ఉద్యమకారులతో నిర్వహించిన విస్తృత స్థాయి సంప్రదింపుల వివరాలను, ఉద్యమకారుల వర్గీకరణ ముసాయిదా మరియు వారు సమర్పించిన ప్రధాన విజ్ఞప్తుల నివేదికను కమిటీ ముఖ్యమంత్రికి సమర్పించి సమగ్రంగా వివరించింది. కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉద్యమకారుల విజ్ఞప్తుల పట్ల అత్యంత సానుకూలంగా స్పందించారు. ఆత్మగౌరవ సంక్షేమం: స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలను, భవిష్యత్తును పణంగా పెట్టిన తెలంగాణ ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం, వారి కుటుంబాలకు సేవ చేయడం ఈ ప్రజా ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఎలాంటి జాప్యం లేకుండా కసరత్తు పూర్తి: ఉద్యమకారుల గుర్తింపు మరియు సంక్షేమ కసరత్తును (Identification & Welfare Exercise) ఎక్కడా ఆలస్యం చేయకుండా, అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని కమిటీకి సూచించారు.
కమిటీకి పూర్తి సహకారం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు:
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి. శేషాద్రి, ఐఏఎస్ (Sri V. Seshadri, IAS – Special Chief Secretary to CM), ముఖ్యమంత్రి కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ఐఏఎస్ / వి.పి. గౌతమ్, ఐఏఎస్ / ఎస్. శ్రీధర్, ఐఏఎస్ (Sri S. Sridhar, IAS – Secretary to CM), ముఖ్యమంత్రి ఓఎస్డీలు (OSDs to CM) మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ పోర్టల్ రూపకల్పన, డిజిటల్ దరఖాస్తుల స్వీకరణ, జిల్లాల వారీ సమన్వయం మరియు అవసరమైన పరిపాలనాపరమైన వనరుల కల్పనలో కమిటీకి పూర్తి స్థాయిలో అధికారిక సహకారాన్ని అందించాలని హాజరైన ఉన్నతాధికారులను సీఎం గారు ఆదేశించారు.
ముఖ్యమంత్రికి కమిటీ కృతజ్ఞతలు:
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ జీవో నెం. 679 ద్వారా కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా.. ఉద్యమకారుల ప్రధాన డిమాండ్లైన 250 గజాల నివాస స్థలాలు, ఆసరా పెన్షన్, హెల్త్ కార్డ్స్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం మరియు ఉద్యోగులకు గౌరవ గుర్తింపు తదితర అంశాలపై ఎంతో సానుకూలంగా స్పందించినందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి చైర్మన్ కేకే, కోదండరామ్, శోభన్ రెడ్డి, రాములు నాయక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.