గోల్ఫ్‌ టూరిజం హబ్‌గా తెలంగాణ: మంత్రి జూపల్లి కృష్ణారావు

  • షామీర్‌పేట సమీపంలోని జవహర్‌నగర్‌లో 130 ఎకరాల్లో గోల్ఫ్‌ కోర్సు
  • సోమశిలలో మరో ప్రపంచస్థాయి కోర్సు.. పీపీపీ విధానంలో అభివృద్ధి
  • పర్యాటకం, క్రీడల ప్రచారానికి కపిల్‌దేవ్‌ సేవలు వినియోగించుకుంటాం

హైదరాబాద్‌: తెలంగాణను ప్రపంచస్థాయి గోల్ఫ్‌ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా షామీర్‌పేట సమీపంలోని జవహర్‌నగర్‌లో 130 ఎకరాల్లో గోల్ఫ్‌ కోర్సు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గోల్ఫ్‌ క్రీడాకారులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామన్నారు.

సోమశిలలో మరో ప్రపంచస్థాయి కోర్సు
కృష్ణానది తీరంలో, నల్లమల అడవులు, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్ ప‌ర్యాట‌క క్ల‌స్ట‌ర్ సోమశిలలో మరో ప్రపంచస్థాయి గోల్ఫ్‌ కోర్సు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. సోమశిలను ప్రత్యేక గోల్ఫ్‌ టూరిజం గమ్యస్థానంగా అభివృద్ధి చేయడంతో తెలంగాణను గోల్ఫ్‌ టూరిజం హబ్‌గా మరింత బలోపేతం చేయవచ్చన్నారు. గోల్ఫ్‌ టూరిజం మౌలిక వసతుల అభివృద్ధిలో పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానాన్ని అనుసరించనున్నట్లు తెలిపారు.

తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌ 12వ ఎడిషన్‌ సందర్భంగా శనివారం గోల్కొండలోని హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. డీపీ వరల్డ్‌ ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా (డీపీ వరల్డ్‌ పీజీటీఐ), హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి ఈవెంట్‌ పార్ట్‌నర్‌గా తెలంగాణ టూరిజం వ్యవహరిస్తోంది.

తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌ కేవలం క్రీడా పోటీ మాత్రమే కాదని.. అంతర్జాతీయ గోల్ఫ్‌ను తెలంగాణ పర్యాటక, వారసత్వ సంపదతో అనుసంధానించే వేదిక అని జూపల్లి అన్నారు. గోల్కొండ కోట స‌మీపంలోని గోల్ఫ్ కోర్సులో ఈ టోర్నీ నిర్వహించడం రాష్ట్ర చరిత్ర, వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ద‌క్కింద‌న్నారు. హైదరాబాద్‌ నగరానికే తెలంగాణ పర్యాటకం పరిమితం కాదని.. రాష్ట్రంలోని సరస్సులు, అడవులు, గోదావరి, కృష్ణా నదులు, రాజభవనాలు, కోటలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు.

కపిల్‌దేవ్‌ సేవలు వినియోగించుకుంటాం
తెలంగాణలో పర్యాటకం, క్రీడల ప్రచారం కోసం కపిల్‌దేవ్‌ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని జూపల్లి తెలిపారు. ఆయన అనుభవం, అంతర్జాతీయ గుర్తింపును రాష్ట్ర పర్యాటక, క్రీడా రంగాల ప్రచారానికి ఉపయోగించుకుంటామని చెప్పారు. టోర్నీ నిర్వహణకు సహకరిస్తున్న డీపీ వరల్డ్‌ పీజీటీఐ, హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌, ఇతర భాగస్వాములకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణను ప్రపంచస్థాయి గోల్ఫ్‌ టూరిజం గమ్యస్థానంగా అభివృద్ధి చేసేందుకు ప్రపంచస్థాయి సౌకర్యాల కల్పన కొనసాగిస్తామని చెప్పారు.

తెలంగాణ టూరిజం సహకారం అభినందనీయం
డీపీ వరల్డ్‌ పీజీటీఐ అధ్యక్షుడు కపిల్‌దేవ్‌ తెలంగాణ టూరిజం అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. ఈ టోర్నీ ద్వారా తెలంగాణ, హైదరాబాద్‌ను ప్రముఖ గోల్ఫ్‌ టూరిజం గమ్యస్థానాలుగా ప్రచారం చేయవచ్చన్నారు. హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ అందిస్తున్న వేదికకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచానికి హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌ పరిచయం
హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ కెప్టెన్‌ జస్విందర్‌ సింగ్‌ బిర్గి మాట్లాడుతూ.. 12వ తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌కు ఆతిథ్యమివ్వడం ఆనందంగా ఉందన్నారు. ప్రముఖ గోల్ఫర్ల ఆటను హెచ్‌జీఏ సభ్యులు వీక్షించే అవకాశం లభిస్తుందని తెలిపారు. లైవ్‌ టెలికాస్ట్‌ ద్వారా హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌ ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం అవుతుందన్నారు.

132 మంది గోల్ఫర్లు.. రూ.కోటి ప్రైజ్‌మనీ
సెప్టెంబరు 1 నుంచి 4 వరకు జరిగే టోర్నీలో 132 మంది గోల్ఫ్‌ క్రీడాకారులు పాల్గొననున్నారు. రూ.కోటి ప్రైజ్‌మనీ కోసం పోటీపడనున్నారు. భారత్‌తో పాటు విదేశాలకు చెందిన ప్రముఖ గోల్ఫర్లు పాల్గొంటున్నారు. టోర్నీకి అధికారిక ప్రపంచ గోల్ఫ్‌ ర్యాంకింగ్‌ (OWGR) పాయింట్లు లభించనున్నాయి. కార్యక్రమంలో డీపీ వరల్డ్‌ పీజీటీఐ సీఈఓ అమన్‌దీప్‌ జోల్‌, చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన అంతర్జాతీయ గోల్ఫర్‌ స్టెపాన్‌ డానెక్‌ తదితరులు పాల్గొన్నారు.