- ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎంతో మారిషస్ బృందం భేటీ
మారిషస్ లో తెలుగు భాష, సంస్కృతి, పురాణ ఇతిహాసాలను ప్రమోట్ చేసేందుకు ఆదేశానికి అన్ని విధాలా సహకరిస్తామని మారిషస్ ప్రతినిధులుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ చెప్పారు. శనివారం నాడు మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో మారిషస్ పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల మంత్రి లచ్మునా రాజ్ పెంటియా బృందం ఉప ముఖ్యమంత్రితో భేటీ అయింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వారితో మాట్లాడుతూ.. తెలంగాణ – మారిషస్ మధ్య సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ప్రజల మధ్య స్నేహపూర్వ సంబంధాలున్నామని గుర్తు చేశారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల ద్వారా తెలంగాణకు మారిషస్‌తో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. మారిషస్‌లోని తెలుగు సమాజం అక్కడి గొప్ప బహుళ సాంస్కృతిక సమాజంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉందన్నారు. మారిషస్ ప్రభుత్వం చేపడుతున్న రామ భజనంను కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భట్టి విక్రమార్క చెప్పారు. విద్య, సాంస్కృతిక పరిశోధన, కళలు, భాష, సాంస్కృతిక అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. మారిషస్ లోని తెలుగు కల్చరల్ సెంటర్ లో లక్షలాదిమంది తెలుగు ప్రవాసులు తమ సంస్కృతి, సంప్రదాయాలను, భాష పరిరక్షణ చేస్తున్నారని మారిషస్ మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజం పట్ల తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు, తెలుగు భాష, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు చేస్తున్న కృషి పట్ల వారు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు.