- దేశానికి దిశానిర్దేశం చేసేలా రాష్ట్ర జలవనరుల నిర్వహణ విధానం
- కేంద్రం–రాష్ట్రాల సమన్వయంతో సుస్థిర జలభద్రతకు ఉమ్మడి కార్యాచరణ
- 25.70 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ — 9.70 టీఎంసీల నిల్వ సామర్థ్యం పునరుద్ధరణ
- జియోట్యాగింగ్‌తో నిధుల వినియోగంలో పారదర్శకత — ఫలితాలపై జవాబుదారీతనం
- గొలుసుకట్టు చెరువుల వ్యవస్థకు సమగ్ర, దీర్ఘకాలిక పరిరక్షణ
హైదరాబాద్ :దేశవ్యాప్తంగా సుస్థిర జలవనరుల నిర్వహణకు సమన్వయంతో కూడిన కార్యాచరణ రూపొందించే లక్ష్యంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్న రెండు రోజుల జాతీయ సదస్సులో తెలంగాణ తన సమగ్ర జలభద్రత నమూనా (Unified Water-Security Model)ను దేశం ముందుంచనుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న ఈ జాతీయ సదస్సు నేపథ్యంలో, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ సదస్సులో తెలంగాణ తరఫున సమర్పించనున్న ప్రజెంటేషన్‌లో పొందుపరచాల్సిన అంశాలు, రాష్ట్రంలో అమలవుతున్న జలసంరక్షణ కార్యక్రమాలు, గొలుసుకట్టు చెరువుల పరిరక్షణ, జలవనరుల జియోట్యాగింగ్, భూగర్భజలాల పర్యవేక్షణతో పాటు దేశవ్యాప్తంగా అనుసరించదగిన సమగ్ర జలభద్రత విధానంపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. దేశ జలభద్రతకు సంబంధించిన కీలక సవాళ్లపై కేంద్రం, రాష్ట్రాలు ఒకే వేదికపై చర్చించి భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో ఈ సదస్సుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని మంత్రి పేర్కొన్నారు. జలవనరుల సంరక్షణ నుంచి ప్రజలకు సురక్షితమైన తాగునీటి సరఫరా వరకు వివిధ అంశాల్లోన్ కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం సాధిస్తూ, నిర్దిష్ట కాలపరిమితితో కూడిన జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని తెలిపారు.