*వ్యవసాయ రంగానికి వైఎస్సార్, స్వామినాథన్ అందించిన సేవలు చిరస్మరణీయం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రైతుల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకువచ్చిన ఇద్దరు మహనీయులు డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. న్యూఢిల్లీలో కేవీపీ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి మరియు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయ రంగానికి శాస్త్ర సాంకేతిక ఫలాలను డాక్టర్ స్వామినాథన్ అందిస్తే… రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందనే భరోసాను డాక్టర్ వైఎస్ఆర్ కల్పించారని ఆయన పేర్కొన్నారు. ‎ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ఒకప్పుడు ఆకలి చావులతో అలమటించిన దేశాన్ని హరిత విప్లవంతో ఆహార భద్రత వైపు నడిపించిన ఘనత నాటి ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ దృఢ సంకల్పానికి, ఎం.ఎస్. స్వామినాథన్ లాంటి శాస్త్రవేత్తల కృషికి దక్కుతుందన్నారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్… వ్యవసాయం అంటే కేవలం పంట మాత్రమే కాదని, ఆ పంటను పండించే రైతు కుటుంబం అని గట్టిగా నమ్మానని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్, సాగునీరు, రుణాలు అందించడంతో పాటు వారి కుటుంబాలకు వైద్యం, విద్యను చేరువ చేసి రైతు సంక్షేమాన్ని తన పాలనలో ప్రధాన భాగంగా మార్చారని గుర్తుచేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సైతం విస్మరించలేని విధంగా రైతు సంక్షేమానికి వైఎస్సార్ బాటలు వేశారని ప్రశంసించారు.

‎తన రాజకీయ ప్రస్థానంలో వైఎస్ఆర్ నాయకత్వంలో చీఫ్ విప్‌గా పనిచేయడం తనకు దక్కిన అరుదైన అవకాశమని భట్టి విక్రమార్క భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. 2009 ఎన్నికల తర్వాత కొత్తగా ఎన్నికైన 74 మంది యువ ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించేందుకు వైఎస్సార్ సూచన మేరకు ఐదు రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించామని చెప్పారు. ఆ తరగతులకు ప్రతిరోజూ హాజరైన వైఎస్సార్… దేశాన్ని సమైక్యంగా ఉంచుతూ పేదల సంక్షేమంతో పాటు అభివృద్ధిని సాధించే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని యువ ఎమ్మెల్యేలకు ఉద్బోధించారని తెలిపారు. జీవితాంతం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన చేసిన దిశానిర్దేశం ఇప్పటికీ తమకు నిత్య స్ఫూర్తిదాయకమని చెప్పారు.
‎డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి, డాక్టర్ కె.వి.పి. రామచంద్రరావుల మధ్య ఉన్న స్నేహం ఎందరికో ఆదర్శమని ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గుల్బర్గాలో విద్యార్థి దశ నుంచే ప్రారంభమైన వీరి ప్రయాణంలో, అప్పట్లో విద్యార్థి రాజకీయాల్లో ఎదురైన సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు వెళ్లేవారని, ఖర్గే గారు వారికి అండగా నిలబడి మార్గదర్శనం చేశారని గుర్తుచేశారు. మిత్రుడు భౌతికంగా దూరమైనా ఆయన ఆశయాలను సజీవంగా ఉంచేందుకు కె.వి.పి. రామచంద్రరావు ‘డాక్టర్ వైఎస్ఆర్ అండ్ డాక్టర్ కెవిపి ఫౌండేషన్’ స్థాపించి ఢిల్లీలో ఈ వేడుకను నిర్వహించడం వారి చిరకాల స్నేహానికి నిదర్శనమని కొనియాడారు. గ్రామీణ భారతదేశ అభ్యున్నతికి కృషి చేస్తున్న ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, వైఎస్సార్ ఫౌండేషన్ నిర్వాహకులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.