రూ.18,250 కోట్ల ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ప్రణాళిక

  • లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు చేయాలి: మంత్రి ఉత్తమ్‌ ఆదేశం
  • వానాకాలంలో 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు తెలంగాణ సన్నద్ధం
  • అక్టోబర్‌ 1 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలు
  • దేశీయ, అంతర్జాతీయ డిమాండ్‌పై అధ్యయనం అనంతరం ఏడు సన్న రకాల ఎంపిక
  • తెలంగాణ బియ్యానికి అంతర్జాతీయ ఎగుమతి మార్కెట్‌ను అభివృద్ధి చేయాలి

హైదరాబాద్‌ : రూ.18,250 కోట్ల అంచనా విలువతో చేపట్టనున్న వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ కార్యాచరణను అమలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి రాకూడదని, ధాన్యం విక్రయించిన అనంతరం నగదు చెల్లింపుల్లోనూ ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అదనపు కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులతో శనివారం మఱ్ఱి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శనివారం రోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడారు. ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌–2026-27లో రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,283 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వీటిలో 3,180 ఐకేపీ కేంద్రాలు, 4,372 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాలు, మరో 731 ఇతర కొనుగోలు కేంద్రాలు ఉంటాయని వివరించారు. అక్టోబర్‌ 15 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్టోబర్‌ 1 నాటికే అన్ని కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం గ్రేడ్‌–ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,461, సాధారణ రకం ధాన్యానికి రూ.2,441 కనీస మద్దతు ధరగా నిర్ణయించిందని తెలిపారు. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఏడు ప్రాధాన్య సన్న రకాల ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ చెల్లించనున్నట్లు చెప్పారు. బీపీటీ–5204, ఆర్‌ఎన్‌ఆర్‌–15048, కేఎన్‌ఎం–1638, జై శ్రీరామ్‌, హెచ్‌ఎంటీ–సోనా, డబ్ల్యూజీఎల్‌–44, కేఎన్‌ఎం–7715 రకాలకు ఈ బోనస్‌ వర్తిస్తుందని వెల్లడించారు. ఈ ఏడు రకాలను ఏకపక్షంగా ఎంపిక చేయలేదని, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న డిమాండ్‌ను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన అనంతరమే మెరుగైన ధర లభించే అవకాశమున్న రకాలను గుర్తించామని వివరించారు.

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినా, బహిరంగ మార్కెట్‌లో అమ్ముకున్నా రైతుకు గిట్టుబాటు ధర లభించాలన్నదే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ బియ్యానికి దేశీయ మార్కెట్‌తోపాటు అంతర్జాతీయ స్థాయిలోనూ స్థిరమైన ఎగుమతి మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొన్ని సందర్భాల్లో కొనుగోలు ధర కంటే తక్కువకు విక్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ బియ్యం ఎగుమతులను ప్రోత్సహించి, అంతర్జాతీయ మార్కెట్‌లో స్థిరమైన డిమాండ్‌ను సృష్టించగలిగితే రాష్ట్ర రైతులకు మెరుగైన ధర లభించడంతోపాటు ధరల వ్యత్యాసం కారణంగా ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని కూడా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో పంటల సాగు విధానంలో వస్తున్న సానుకూల మార్పులను మంత్రి ప్రస్తావించారు. సాధారణంగా వానాకాలం సాగు వర్షాలపై ఆధారపడి ఉండగా, యాసంగి వేసవి పంట కావడంతో గతంలో వానాకాలంతో పోలిస్తే యాసంగి ధాన్యం దిగుబడి తక్కువగా ఉండేదన్నారు. ప్రస్తుతం యాసంగి ధాన్యం ఉత్పత్తి వానాకాలం స్థాయికి చేరుకోవడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో దానిని అధిగమించడం తెలంగాణ వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న సానుకూల పరిణామమని పేర్కొన్నారు. ప్రస్తుత వానాకాలంలో 57.70 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, 119.57 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిపారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా 45 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యం, 20 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు ధాన్యం కలిపి మొత్తం 65 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో ధాన్యం రాక గరిష్ఠ స్థాయికి చేరుతుందని మంత్రి తెలిపారు. నవంబర్‌లో 24.72 లక్షల మెట్రిక్‌ టన్నులు, డిసెంబర్‌లో 25.32 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగానే గోదాములు, గన్నీ సంచులు, రవాణా వాహనాలు, హమాలీలు, తూకం మరియు నాణ్యత నిర్ధారణ పరికరాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. రవాణా వ్యవస్థలో ఎదురవుతున్న సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించిన మంత్రి, టెండర్లలో పాల్గొనే రవాణా కాంట్రాక్టర్లకు అవసరమైన సంఖ్యలో లారీలు సొంతంగా ఉన్నాయా లేదా వాటిని సమకూర్చుకునే విశ్వసనీయ ఏర్పాట్లు ఉన్నాయా అనే విషయాన్ని ముందుగానే నిర్ధారించాలని సూచించారు. రవాణా లోపాల కారణంగా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపు నిలిచిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వవద్దని స్పష్టం చేశారు. ఈ సీజన్‌కు మొత్తం 16.25 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయని, ప్రస్తుతం 3.50 కోట్ల సంచులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మిగిలిన సంచుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డులు, రాష్ట్ర మరియు కేంద్ర గిడ్డంగుల సంస్థల గోదాములు, రైతు వేదికలు, ప్రభుత్వ భవనాలు, ఇతర అనుమతించబడిన ప్రదేశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతి జిల్లా సమగ్ర నిల్వ ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్‌ ఆధారిత ట్రాకింగ్‌ను తప్పనిసరిగా అమలు చేయడంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి అనధికారికంగా ధాన్యం రాకుండా సరిహద్దు తనిఖీ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ‘‘ధాన్యం కొనుగోలు యంత్రాంగం అంతా రైతు ప్రయోజనాల పరిరక్షణే పరమావధిగా పనిచేయాలి. కొనుగోలు కేంద్రాలను నిరంతరం తనిఖీ చేయాలి. రైతుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి. తూకం, నాణ్యత పరీక్షల్లో పూర్తి పారదర్శకత పాటించాలి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలిస్తూ, రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలి’’ అని మంత్రి స్పష్టం చేశారు. ‘‘రూ.18,250 కోట్ల విలువైన 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ప్రతి స్థాయిలోనూ సూక్ష్మ ప్రణాళిక అవసరం. రైతుకు సరైన ధర లభించాలి. చెల్లింపులు సకాలంలో జరగాలి. ఏ దశలోనూ రైతుకు అసౌకర్యం కలగకూడదు’’ అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, సంచాలకుడు శ్యామ్‌ ప్రసాద్‌, అదనపు సంచాలకుడు రోహిత్‌ సింగ్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.