హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న ఎల్-నినో ప్రభావంతో ఎదురవుతున్న తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని జల, ఇంధన వనరులను అత్యంత పొదుపుగా వాడుకోవాలని రైతులకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎల్-నినో నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల్లోని రైతు వేదికల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ, ప్రపంచ వాతావరణ సంస్థ నివేదికల ప్రకారం ఎల్నినో ప్రభావం డిసెంబర్ నాటికి గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని, 2027 వరకు ఇలాంటి పరిస్థితులు కొనసాగవచ్చని అంచనాలు ఉన్నట్లు తెలిపారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం కారణంగా ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే జూన్, జులై మాసం వరకు రాష్ట్రంలో వర్షాలు వచ్చే పరిస్థితి కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో నీటి వనరులను కేవలం తాగునీటి సౌకర్యానికి మాత్రమే వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. మంచి నీటి ఎద్దడి, ఆహారర ధాన్యాల కొరత, పశువులకు దాన, నీటి సౌకర్యం కల్పించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా పనిచేయాలని తెలిపారు. ఇప్పటికే, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా పనిచేస్తోందని, వ్యవసాయ, సంబంధిత శాఖల విశ్వవిద్యాలయాల వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలయాలతో చేపట్టాల్సిన చర్యలపై రైతులను చైతన్య పరుస్తున్నామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు నష్టం కలిగే చర్యలను ప్రోత్సహించమని, పంట నష్టాలను తగ్గించే ప్రయత్నాలను చేపట్టామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న నీటిని కేవలం తాగునీటికి, పశువులకు నీటి వసతికి మాత్రమే వాడుకోవాలన్నారు.
ఈ సందర్బంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, రైతులు ఈ యాసంగిలో వరి, పత్తి పంటలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆరుతడి పంటలు, తక్కువ సమయంలో పండే పంటలు పండించాలని, ఆరుతడి పంటల విత్తనాలను సబ్సిడీపై అందచేస్తున్నామని స్పష్టం చేశారు. అతి తక్కువ సమయం, అతి తక్కువ నీటిని ఉపయోగించే ఆరుతడి పంటలనే వేసుకోవాలన్నారు. ఈ సంవత్సరం వేసవి తీవ్రత 50 సెంటి గ్రేడ్ కు చేరుకునే పరిస్థితి ఉందని తెలిపారు. ఇప్పటికీ, 315 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదయిందని వెల్లడించారు. నీటిపారుదల శాఖ, వ్యవసాయ, ఇంధన, పంచాయితీ రాజ్, పశు సంవర్ధక శాఖ, భూగర్భ జల వనరుల శాఖ, రెవిన్యూ తదితర శాఖలు ఎల్-నినో తీవ్ర పరిస్థితులపై రైతులను చైతన్య పర్చాలని తెలిపారు. అత్యవసర క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎల్ -నినో పరిస్థితులు, కేంద్రానికి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లే అంశంపై చర్చిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 15 లక్షల ఎకరాల మేర వరి సాగు విస్తీర్ణం తగ్గిందని పేర్కొన్నారు. సాగులో ఉన్న పంటలను కాపాడుకోవడంతో పాటు రబీలో పప్పుదినుసులు, నూనెగింజలు, తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలను సాగు చేయాలని సూచించారు. రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని, తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. విద్యుత్ సరఫరా, భూగర్భ జలాల లభ్యతపై వాస్తవ పరిస్థితులను రైతులకు తెలియజేయాలని పేర్కొన్నారు.
రానున్న 10 నెలలు తాగునీటికే ప్రాధాన్యం – సి.ఎస్ సంజయ్ జాజు
రాష్ట్రంలో, గత వర్షాకాల సీజన్ తో పోల్చితే, ఈసారి దాదాపు 20 శాతం లోటు వర్షపాతం నమోదయిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదయిందని అన్నారు. రాష్ట్రంలోని కృష్ణా బేసిన్ లో 270 టి.ఎం.సి లకు బదులుగా 80 టి.ఎం.సి ల నీరు, గోదావరి బేసిన్ లో 150 టి.ఎం.సి లకు బదులుగా 100 టి.ఎం.సి ల నీరే వచ్చిందని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయానికి నీరు అందించే పరిస్థితి లేదని, రానున్న 10 నెలలు తాగునీటి సరఫరాను అందించడానికి తాము అత్యంత ప్రాధాన్య నిస్తున్నామన్నారు. అదేవిధంగా పశువులకు పశుగ్రాసం, నీటి వసతికి ప్రాధాన్యత నిస్తున్నామని అన్నారు. ఎల్-నినో పరిస్థితులనుఎప్పటికప్పుడు అంచనావేసి తగు మార్గదర్శకాలను అందించేందు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిల్లో ప్రత్యేకంగా వార్ రూమ్ లను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి విభిజిరాంజి (ఉపాధి హామీ ) పనులను పెద్ద ఎత్తున చేపడుతున్నట్టు వెల్లడించారు.
భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి – వ్యవసాయ శాఖ కార్యదర్శి- సురేంద్ర మోహన్
రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టం రోజు రోజుకు పడిపోతున్నందున అతితక్కువ నీటిని ఉపయోగించుకునే ఆరుతడి పంటలనే వేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి అన్నారు. ఎల్ నినో ప్రభావంపై గత నాలుగు నెలలుగా రైతు నేస్తం ద్వారా రైతులను చైతన్య పరుస్తూనే ఉన్నామని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ రబి లో వారి, పట్టి పంటలను వేయొద్దని సూచించారు. బిందు సేద్యంతో పామ్ తోటలు, కూరగాయలు వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేయవచ్చన్నారు.
ఇప్పటికే 4 డిగ్రీల అధిక ఉష్టోగ్రతలు – వాతావరణ శాఖ
ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదవడమే కాకుండా ఉష్టోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారి డా. స్రవంతి పేర్కొన్నారు. ఈ నవంబర్, డిసెంబర్ లలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుందని, 35 డిగ్రీలు ఉండాల్సిన ఉష్టోగ్రతలు 37 కు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఈ శని రుతుపవనాల ప్రభావం కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని హెచ్చరించారు.
దేశంలో ఎక్కడా కూడా విధ్యుత్ అందుబాటులో లేదు – నవీన్ మిట్టల్
ఎల్-నినో ప్రాభవం దేశవ్యాప్తంగా ఉన్న దృష్ట్యా విధ్యుత్ కొనుగోలు చేద్దామన్న ఎక్కడా కూడా అందుబాటులో లేదని రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని జలాశయాలలో నీటి లభ్యత లేనందువల్ల, గత సంవత్సరానికి పోల్చి చూస్తే, ఈ సంవత్సరం కేవలం 25 శాతం విధ్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతోందన్నారు. ఈ సెప్టెంబర్ 30 వ తేదీన గతంలో ఎన్నడూ లేనివిధంగా 19,892 మెగా వాట్ల రికారు స్థాయి విధ్యుత్ వినియోగం అయిందని వెల్లడించారు.
మేజర్ రిజర్వాయర్లలో నీళ్లు లేవు _ నీటి పారుదల శాఖ.
రాష్ట్రంలోని మేజర్ , మినార్ నీటి పారుదల ప్రాజెక్టులలో ప్రస్తుతం ఉన్న నీటిని 2027 జులై మాసం వరకు తాగు నీటి అవసరాలకు అందించేందుకు వీలుగా నిలువ చేస్తున్నామని నీటి పారుదల శాఖ ఈ.ఎన్.సి తెలిపారు. గత సంవత్సరం వివిధ ప్రాజెక్టుల ద్వారా 37.56 లక్షల ఎకరాలకు సాగునీరందింస్తే, ఈ సారి ఎల్-నినో ప్రభావంతో కేవలం 7 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందించినట్టు పేర్కొన్నారు.
రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ప్రణాళికలు – దాన కిషోర్
ఎల్-నినో ప్రభావంతో తీవ్ర పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ తాగునీటి సరఫరాకు పకడ్బందీ ప్రణాలికను రూపొందిస్తున్నట్టు పంచాయితీ రాజ్, తాగు నీటీ సరఫరా ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ వెల్లడించారు. ఇప్పటికే , డిసెంబర్ మాసం వరకు ఏవిధమైన ఇబందులు లేకుండా నీటి సరఫరాను అందించగలుగుతామన్నారు. తిరిగి, డిసెంబర్ మాసంలో ప్రత్యామ్నాయ ప్రణాలికను ప్రకటిస్తామని, ప్రతీ అసెంబ్లీ నియోజకనికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి పరిస్థితులను సమీక్షిస్తున్నామని అన్నారు. ఉపాధి పనుల ద్వారా పశువులకు తాగు నీటి వసతులు, ఇతర పనులను పెద్ద ఎత్తున చేపడుతామని అన్నారు.
రాష్ట్రంలో 1.39 కోట్ల జీవాలకు ప్రత్యేక ఏర్పాట్లు
రాష్ట్రంలో 1.39 కోట్ల పశువులు, జీవాలున్నాయని, వీటికి పశుగ్రాసం, నీటి వసతులను కల్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ కార్యదర్శి ఇలంబర్తి వెల్లడించారు. ఎమర్జెన్సీ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మానిటరింగ్ సెల్ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 4 రకాల పప్పు దినుసులు, 4 రకాల నూనె గింజల పంటలను వేయాలి – వ్యవసాయ శాస్త్ర వేత్తలు ఎల్ నినో ప్రభావం తో నీటి లభ్యత అత్యంత తాకువగా ఉన్నందున నీటిని తాకువగా ఉపయోగించే నాలుగు రకాల పప్పు దినుసులైన పేసర్లు, , మినుములు, శనిగలు, వేరు సెనగ లతో పాటు, సన్ ఫ్లవర్, నువ్వులు, కుసుమ ల ఆరు తడి పంటలను వేయాలని వ్యవసాయ శాస్త్ర వేత్తలు సూచించారు. వరి పంటను క్రాప్ హాలిడే గా చేయాలని అన్నారు. కూరగాయలను కూడా విస్తృతం గా వేయాలన్నారు. ఈ వీడియొ కాన్ఫరెన్స్ లో వివిధ శాఖ ఉన్నతాధికారులు, వాతావరణ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం, పశుసంవర్ధక శాఖల అధికారులు పాల్గొన్నారు.
