అసెంబ్లీ ప్రాంగ‌ణంలో అంబ‌రాన్ని తాకిన బతుక‌మ్మ సంబ‌రాలు

  • బ‌తుక‌మ్మ‌ల‌ చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ భక్తిశ్రద్ధలతో పాటలు పాడిన మ‌హిళ‌లు
  • పాల్గొన్న స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి

హైద‌రాబాద్ : బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ప్రకృతిని ఆరాధించే గొప్ప సంస్కృతికి ప్రతీక అని తెలంగాణ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగ‌ణంలో సోమ‌వారం రోజు సాయంత్రం నిర్వ‌హించిన‌ బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సంబరాల్లో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ పాల్గొని ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడారు.

బంతి, చామంతి, గునుగు, తంగేడు పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి, మహిళా ఉద్యోగులు, సిబ్బంది చుట్టూ చేరి “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో” అంటూ పాటలు పాడుతూ ఆడి పాడారు. మహిళలంతా బ‌తుక‌మ్మ‌ల‌ చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ భక్తిశ్రద్ధలతో పాటలు పాడారు. తెలంగాణ ఆడ‌బిడ్డ‌ల ఆత్మీయ‌త‌, ఉత్సాహం మ‌ధ్య సాగిన ఈ వేడుక‌లు పండుగ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించాయి. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం సోమవారం సాయంత్రం రంగురంగుల పూలతో, ఆడపడుచుల ఆనంద కోలాహలంతో కళకళలాడింది. బతుకమ్మ వేడుకల్లో శాసన మండలి సెక్రెటరీ డా. నరసింహాచార్యులు, శాసనసభ సెక్రెటరీ ఆర్. తిరుపతి, శాసనసభ, శాస‌న మండ‌లి ఉన్నతాధికారులు, మహిళా ఉద్యోగులు, ఇతర సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.