- టవర్స్ నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన స్థలాలను గుర్తించాలి
- ఈ నెలాఖరులోగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ప్రక్రియ పూర్తి
- సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్లైన్ డ్రా
- లబ్ధిదారులు ఎప్పుడైనా యూట్యూబ్‌లో వివరాలు చూసుకునే అవకాశం
- ఇందిరమ్మ టవర్స్ పై మూడు జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్: పేదల ఉపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా, వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఒకవైపు ప్రభుత్వ భూములను పరిరక్షిస్తూనే, మరోవైపు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి అవసరమైన భూములను యుద్ధప్రాతిపదికన గుర్తించాలని అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలోని నియోజకవర్గాల వారీగా మొదటి విడత నిర్మాణాలకు అవసరమైన స్థలాల గుర్తింపును పూర్తి చేయడంతో పాటు, రెండో, మూడో విడతల్లో చేపట్టనున్న నిర్మాణాలకు కూడా ముందుగానే భూములను సిద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, హౌసింగ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం, రెండో, మూడో విడతలకు అవసరమైన భూముల గుర్తింపు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, హౌసింగ్ శాఖ కార్యదర్శి వి.పి. గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో నివసిస్తున్న పేదల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా, వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్లు నిర్మించి అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, పేదవాడికి సొంత ఇంటిని అందించడం కంటే తమ ప్రభుత్వానికి మరే అంశమూ ఎక్కువ ప్రాధాన్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పూర్తి బాధ్యతతో, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భూముల గుర్తింపు నుంచి నిర్మాణాల ప్రారంభం వరకు ప్రతి దశలోనూ నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని, స్థలాల ఎంపికలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణమే లక్ష్యం
క్యూర్ పరిధిలో మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గంలో సుమారు 500 ఇళ్ల చొప్పున నిర్మాణాలు చేపడుతున్నామని వెల్లడించారు. మొదటి విడతకు సంబంధించి రెండు, మూడు నియోజకవర్గాలకు అవసరమైన స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలని, మిగిలిన నియోజకవర్గాల్లో రెండో, మూడో విడతల నిర్మాణాలకు అవసరమైన భూములను కూడా ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి భూముల లభ్యత, స్థలాల అనుకూలత, ఇతర అవసరమైన అంశాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. మొదటి విడతతో పాటు తదుపరి విడతల నిర్మాణాలకు కూడా ముందస్తు ప్రణాళికతో పనిచేయడం ద్వారా కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎంపికలో పారదర్శకతకు పెద్దపీట
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. హౌసింగ్ కార్పొరేషన్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరించాలని ఆదేశించారు. లబ్ధిదారుల వివరాలన్నింటినీ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసి, ఆన్లైన్ విధానంలో డ్రా నిర్వహించడం ద్వారా ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను మరింత పెంచవచ్చని పేర్కొన్నారు. డ్రా ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేయాలని, ప్రత్యక్షంగా వీక్షించలేని వారు కూడా డ్రాకు సంబంధించిన వివరాలను యూట్యూబ్‌లో లబ్ధిదారులు తమ వివరాలు ఎంపిక జాబితాలో ఉన్నాయో లేదో ఎప్పుడైనా పరిశీలించుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
