రూ.లక్ష కోట్ల అవినీతి కోసమే ‘యాదాద్రి’ డిజైన్‌: సీఎం రేవంత్‌రెడ్డి

యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి విదేశీ బొగ్గు సరఫరా ద్వారా 40 ఏళ్లలో రూ.లక్ష కోట్ల అవినీతికి కేసీఆర్‌ డిజైన్‌ చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ను, జగదీశ్‌రెడ్డిని దామరచర్లలో గుంజకు కట్టేసి కొట్టినా తప్పులేదని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడైనా ముడిపదార్థాలు ఉన్న దగ్గర పరిశ్రమ పెడతారని, బొగ్గు లభించే చోట ఈ ప్రాజెక్టును నిర్మిస్తే రూ.28వేల కోట్లతో పూర్తయ్యేదన్నారు. యాదాద్రిని బొగ్గు అందుబాటులో లేని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో కట్టడం వల్ల వ్యయం రూ.37,800(రూ.9,800కోట్లు అదనం) కోట్లకు పెరిగిందని చెప్పారు. ఈ ప్రాజెక్టును గ్రేడ్‌ – 9 బొగ్గుతో నడిచేలా డిజైన్‌ చేసి, 14 మిలియన్‌ టన్నుల గ్రేడ్‌ – 9 బొగ్గును విదేశాల నుంచి తెచ్చుకునేలా ప్రణాళిక వేశారని విమర్శించారు. 40 ఏళ్లలో రూ.లక్ష కోట్ల అవినీతి కోసమే కేసీఆర్‌ యాదాద్రి విద్యుత్‌ కేంద్రాన్ని డిజైన్‌ చేశారని ఆరోపించారు. దీనికి తెరవెనుక ఉన్నది ప్రతిమా శ్రీనివాస్‌ అని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే ఒరిస్సాలోని నైనీ గని నుంచి యాదాద్రికి కొత్త బొగ్గు తెచ్చామని వెల్లడించారు. ఇంత కష్టపడి రైతులకు కరెంటు ఇస్తుంటే.. కాంగ్రెస్‌ వస్తే కరెంటు ఉండదంటూ అబద్ధాలు చెబుతున్నారని బీఆర్‌ఎస్‌ నేతలపై సీఎం మండిపడ్డారు.

బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఏదైనా మాట్లాడుకోనివ్వండి.. క్షుద్రపూజలు చేసేవాళ్లు కూడా నీతులు చెబితే తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. మంత్రగాళ్లు, నేరగాళ్లను నమ్మాల్సిన పని లేదని అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కేసీఆర్‌ కుటుంబం ఇసుక, బొగ్గు, భూములు, డ్రగ్స్‌, గంజాయి, కొకైన్‌ దేన్నీ వదల్లేదని ఆరోపించారు. ఆంధ్రా కాలేజీలు, ఆస్పత్రులకు పాల సరఫరా హరీశ్‌రావుదైతే.. విదేశీ విస్కీ బిజినెస్‌ సంతోష్‌రావు పెట్టుకున్నాడని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో టానిక్‌ పేరుతో వ్యాపారాన్ని ఏర్పాటు చేశారని, ఇలా పర్మిషన్‌ ఇచ్చింది దేశంలో అదొక్కటేనని చెప్పారు.