నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • 10రోజుల్లో ఇందిర‌మ్మ ఇళ్ల ఫైన‌ల్ బిల్లుల చెల్లింపు
  • పాలేరు నియోజ‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌లో మంత్రి పొంగులేటి వెల్లడి

ఖమ్మం/నేలకొండపల్లి : పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లిలో ఉన్న 3వ శతాబ్దానికి చెందిన చారిత్రక బౌద్ధ స్తూపాన్ని, పరిసర ప్రాంతాలను అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం నేలకొండపల్లిలో పర్యాటక సదుపాయాల కల్పన, బౌద్ధ స్థల సంరక్షణ/పునరుద్ధరణ పనులకు మంత్రిగారు శంకుస్థాపన వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 3 వ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్థూపాన్ని సుమారు 50-55 సంవత్సరాల క్రితం నేలకొండపల్లి గ్రామంలో గుర్తించారని, దేశంలోనే అత్యంత పెద్ద బౌద్ధ స్తూపాల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాంత అభివృద్ధిని ప్రారంభించినప్పటికీ పనులు పూర్తి చేయలేకపోయాయని అన్నారు. స్తూపం చుట్టూ ఉన్న ఒకటిన్నర కిలోమీటరు పరిధిలో పురావస్తు శాఖ అధికారులు గతంలో జరిపిన తవ్వకాల్లో ఎన్నో పురాతన వస్తువులు లభ్యమయ్యాయని, వాటిని భద్రపరిచేందుకు స్థానికంగా వసతులు లేకపోవడంతో హైదరాబాద్ మ్యూజియంలో ఉంచారని తెలిపారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ల మేర‌కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన బౌద్ధ మతస్థులు, స్థానికుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని, రాబోయే రోజుల్లో బౌద్ధ కట్టడాలపై అవగాహన ఉన్న ప్రముఖ నిపుణులను, అధికారులను ఇక్కడికి ఆహ్వానించి విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని అన్నారు.త‌న పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రిగారు విస్తృతంగా ప‌ర్య‌టించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడ‌మేగాక వివిధ ప్ర‌గ‌తి ప‌నుల‌కు శంకుస్థాపనలు చేశారు.

10రోజుల్లో ఫైన‌ల్ బిల్లుల చెల్లింపు
రాష్ట్రవ్యాప్తంగా ఇందిర‌మ్మ ఇళ్ల‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫైనల్ బిల్లులన్నింటినీ రాబోయే 10 రోజుల్లోగా లబ్ధిదారుల ఖాతాల్లో ఎలాంటి లంచాలకు తావు లేకుండా జమ చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. నేలకొండపల్లి రైతు వేదికలో నేలకొండపల్లి మండల లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ నేలకొండపల్లి మండలంలో మొదటి విడత కింద మంజూరైన 648 ఇళ్లలో సుమారు 620 ఇళ్లు పూర్తయ్యాయని, వివిధ కారణాల వల్ల మిగిలిన ఇళ్లను కూడా త్వరలోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, కరెంటు, నీటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో రైతన్నలు నష్టపోకూడదనే ఉద్దేశంతో రెండో పంట వేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి అన్నారు.

అంతకుముందు మంత్రి నేలకొండపల్లి మండలం అనాసాగరం నుండి పమ్మి వరకు 2.5 కిలోమీటర్ల మేర 2.80 కోట్ల అంచనా వ్యయంతో బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు.పాలేరు నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై అన్ని ఇంజనీరింగ్ శాఖల అధికారులతో మంత్రిగారు సమీక్షా సమావేశం నిర్వహించారు. కుసుమంచి మండలం, గోరిళ్లపాడు తండా గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో క‌లెక్ట‌ర్ దివాక‌ర టిఎస్ , హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, పిఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, మండల ఎంపీడీవో ఎర్రయ్య, తహశీల్దార్ రాంప్రసాద్, స్థానిక సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్ర‌జ‌లు పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీలోని నాయుడుపేట జంక్షన్, టి.సి.వి. రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి హాజ‌ర‌య్యారు.