కుమ్రం భీమ్ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని నెహ్రూ శతజయంతి గిరిజన మ్యూజియంలో నిర్వహించిన కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, సంచాలకులు సంతోష్ బి. ఎం., ఐఏఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుమ్రం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుమ్రం భీమ్ పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సంతోష్ బి. ఎం. మాట్లాడుతూ, “జల్, జంగల్, జమీన్‌పై గిరిజనుల హక్కుల కోసం కుమ్రం భీమ్ పోరాడారు. ఆయన పోరాట స్ఫూర్తితోనే నేటి ప్రభుత్వాలు గిరిజన సంక్షేమం కోసం కృషి చేస్తున్నాయి. అయితే, అదే స్ఫూర్తితో మరింత బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. గిరిజన బాలబాలికలందరికీ నాణ్యమైన విద్య అందించడం, గిరిజన ప్రజలందరికీ వైద్య సదుపాయాలు, కనీస మౌలిక వసతులు కల్పించడం ద్వారా కుమ్రం భీమ్ త్యాగం ఆశయాలను నెరవేర్చగలమని పేర్కొన్నారు. ఆ లక్ష్య సాధన దిశగా ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు వి. సర్వేశ్వర రెడ్డి, ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డా. వి. సముజ్వల, గిరిజన మ్యూజియంల సంరక్షకులు డా. సత్యనారాయణ ద్యావనపల్లి, గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజినీర్ బాలు, ఎస్సీ హేమలత, సహ సంచాలకులు శ్రీమతి విజయలక్ష్మి తదితర ఉన్నతాధికారులు, శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. వారంతా కుమ్రం భీమ్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఆయనకు నివాళులర్పించారు.