- న్యూఢిల్లీలో అక్టోబర్ 29న గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమం
హైదరాబాద్ : భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణా–గ్లోబల్ సమ్మిట్–2026లో పాల్గొనాల్సిందిగా 550కి పైగా దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు సంబంధించి వివిధ కమిటీల ద్వారా చేపడుతున్న ఏర్పాట్ల పురోగతిపై మంగళవారం డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ అధికారులు నవీన్ మిట్టల్, హరిచందన, గౌరవ్ ఉప్పల్, సర్ఫరాజ్ అహ్మద్, కృష్ణ ఆదిత్య, అనుదీప్, శశాంక, కృష్ణ భాస్కర్, వల్లూరి క్రాంతి, అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడం, భారీ పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించడం, యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ తెలంగాణా–గ్లోబల్ సమ్మిట్–2026ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ సమ్మిట్‌కు విస్తృత అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో భాగంగా అక్టోబర్ 29న న్యూఢిల్లీలో కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. ఎ. రేవంత్ రెడ్డి పాల్గొంటారని, వివిధ దేశాల రాయబారులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, దిగ్గజ కంపెనీల అధిపతులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి, తెలంగాణలో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ కార్యక్రమం కీలక వేదికగా నిలవనుందని పేర్కొన్నారు. ఇప్పటికే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఇన్వెస్ట్ తెలంగాణా–గ్లోబల్ సమ్మిట్–2026పై రోడ్‌షోలను నిర్వహించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో జరగనున్న ప్రధాన సమ్మిట్‌కు 1,500కు పైగా కంపెనీలు, సంస్థల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం
గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించనున్న రక్షా ఎక్స్ పోలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏరోస్పేస్, రక్షణ రంగాలకు చెందిన సుమారు 100 కంపెనీలు, సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఆయా సంస్థలకు ఇప్పటికే ప్రత్యేక ఆహ్వానాలు పంపామని, ఆహ్వాన ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ఎక్స్ పో లో తెలంగాణలోని ఏరోస్పేస్, రక్షణ రంగాల ప్రతినిధులు పాల్గొంటారు.
సమ్మిట్ నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు
ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ జరిగే ప్రధాన వేదికను 25 సెక్టార్లుగా విభజించి, ప్లీనరీ సమావేశాలు, సెమినార్లు, చర్చలు, ఒప్పందాల కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు, వివిధ కంపెనీలు మరియు సంస్థల ప్రదర్శనలకు అవసరమైన వసతులను ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమ్మిట్‌కు హాజరయ్యే దేశీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా, వసతి, సమావేశాల నిర్వహణతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రతినిధికి సమన్వయ బాధ్యతలు నిర్వహించేందుకు ఒక సీనియర్ అధికారిని నోడల్ అధికారిగా నియమించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇన్వెస్ట్ తెలంగాణా–గ్లోబల్ సమ్మిట్–2026ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ప్రధాన కార్యదర్శి అధికారులకు సూచించారు.
