సమస్త జీవుల జీవన హక్కు

ఇటీవల కేంద్రప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం అడవులలో రైల్వే ట్రాకులు వేయడం వలన, ఆ ట్రాకులను దాటుతూ గడచిన మూడేళ్లలో రైళ్లు ఢీ కొని మరణించిన జంతువుల సంఖ్య 35,732. ఇందులో ఏనుగులు 65 వున్నట్లు దేశ రైల్వే మంత్రిత్వశాఖనే పార్లమెంటులో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఒక సంవత్సరంలో దాదాపు 200 వందల నుంచి 2000 రకాల అరుదైన జీవరాశులను మనం కోల్పోతున్నామని అంతర్జాతీయ లెక్కలు చెబుతున్నాయి. మన దేశంలో కూడా దేశ జంతువైన పెద్దపులి మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. గత దశాబ్ద కాలంగా దాదాపు 1000 పులులను మనం కోల్పోయాము. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40,000 ఏనుగులు అంతరించిపోయాయి. దట్టమైన అడువులు కోల్పోవడం వలన ఏనుగులు సమీప గ్రామాల్లోకి వస్తున్నాయి. దాదాపు 1100 ఖడ్గమృగాలు మనుషుల చేతిలో అంతమయ్యాయి. అరుదైన పక్షి జాతులను కోల్పోతున్నాము.
నవంబర్ 1, 2020 ఆదివారం రోజున ఒక దినపత్రికలో ఒక వార్త చదివాను. తెలంగాణ రాష్ర్టంలో పాల ఉత్పత్తిని పెంచడం కోసం ఆవులకు పెయ్య దూడలే (ఆడ దూడలు) పుట్టే విధంగా ఇంజక్షన్ ఇచ్చే ప్రాజెక్టును చేపట్టనున్నారని, ఆ ప్రాజెక్టులో భాగంగా సెక్స్‌డ్ సెమెన్ ఫెసిలిటీలో కేవలం ఆడ పెయ్యలే పుట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని దాని సారాం శం. సరే! ఆ వార్త విషయం కాసేపు పక్కన పెడితే ఇదంతా దేశ వ్యాప్తంగా, ఆమాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నదే. మనిషి తన అవసరాల కోసం జంతు జీవాలను ఎలా శాసిస్తున్నాడోనన్న విషయం మరోసారి ఇలాంటి వార్తల వల్ల మనకు స్పష్టమవుతోంది.
ఈ ప్రకృతి సమస్త జీవరాశికి అనుగుణంగా తీర్చిదిద్దబడింది. జీవ ప్రపంచంలో అత్యల్ప జీవం నుంచి అతి పెద్ద జీవానికి కూడా ఆహార సమతుల్యతను అందించింది. దీనినే ఫుడ్‌చెయిన్ అంటారు. ఈ ఫుడ్ చెయిన్‌ను సృష్టిలో ఏ జీవరాశి అతిక్రమించదు. ప్రకృతికి తనకు కేటాయించిన విధంగానే తన ఆహారాన్ని తాను పొందుతుంది. సమస్త జీవరాశిలో అతి తెలివైన జీవి మనిషి. ఈ మనిషే ప్రకృతికి విరుద్ధంగా అన్ని పనులు చేస్తుంటాడు. సృష్టి తనకు ఇచ్చిన మేథో సంపత్తిని ఉపయోగించుకొని ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవుడిగా మనిషి ఎదిగాడు. ఈ క్రమంలో సమస్త ప్రకృతిని, జంతు జీవజాలాన్ని, జల వనరులను మనిషి తన ఇష్టానుసారంగా వాడేసుకుంటున్నాడు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని, ప్రకృతిని తన అదుపాజ్ఞలలో ఉంచుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో మనిషి స్వార్థానికి బలైపోతున్నది మొదట అడవులు తరువాత అందులో జీవించే జంతుజాలం.
ఇందాక మనం అనుకున్నట్లు ప్రకృతి సమస్త జీవరాశికి అనువైన ఆహార భద్రతను అందుబాటులో ఉంచింది. ఇలా సృష్టిలో ప్రతిజీవి ఏదో ఒక ఫుడ్ చెయిన్‌లో వుంటుంది. సహజంగానే అడవులలో పులి, సింహం ఫుడ్‌చెయిన్‌లో ప్రథమంగా వుంటాయి. ఎందుకంటే పులిని, సింహాలను చంపి తినే జంతువులు లేవు. చిన్న చిన్న కీటకాలు గడ్డి ఇతరత్రా తిని బతుకుతుంటాయి. వాటిని కప్పలు తింటే, ఆ కప్పల్ని పాములు తింటాయి, ఈ పాముల్ని గద్దలు ఎత్తుకుపోతాయి ఇదొక ఫుడ్ చెయిన్. ఇలాగే అడవులలో చిన్న చిన్న జంతువులు కుందేళ్లు, జింకలు వంటివి మొక్కలు, చెట్లు చేమలతో వచ్చే ఆహారాన్ని తీసుకుంటాయి. వీటిని పులి, సింహం వంటి జంతువులు వేటాడి తింటాయి ఇదొక ఫుడ్ చెయిన్. ఇలా అన్ని జంతు జీవాలు ఈ క్రమాన్ని అతిక్రమించకుండా జీవిస్తున్నాయి. కాని వీటిలో మనిషే ఏ కోవకు చెందుతాడో అర్థం కావడం లేదు. ఎందుకంటే మనిషి మొక్కల నుంచి వచ్చే ఆహారం తీసుకుంటున్నాడు, అలాగే మాంసాహారం కూడా తింటున్నాడు. అందుకోసం మనిషి పులి, సింహం లాగా జంతువులను వేటాడడం లేదు. అలాగే తమ ఆహారం కోసం మనిషిని వేటాడి తినే జంతువులు లేవు. మనిషి తన తెలివి తేటలతో భూమ్మీద ఉన్న సమస్థ జీవరాశిని అంతం చెయ్యగలడు.
కాని ఇవాళ మనిషి తనకు కావాల్సిన మాంసాన్ని కూడా వేటాడి సంపాదించుకోకుండా సొంతంగా కావాల్సినన్ని జీవాలను పెంచి, పోషించి మాంసంగా మార్చుకొని తినగలుగుతున్నాడు. ఇలా చూసిన సహజమైన ఫుడ్ చెయిన్‌లో మనిషి లేడు. ఇలా మనిషి అత్యాశ వల్లనే ఆహార చక్రం నుంచి కొన్ని జీవరాశులు మాయమైపోతున్నాయి. తన అవసరాల కోసం మనిషి అడవిని ఆక్రమిస్తున్నాడు. దీని వలన అనేక జీవరాశులు అంతమైపోతున్నాయి. దీంతో ఆ జీవరాశులపై ఆధారపడే మరొక జీవరాశి ఆహారం దొరకక అంతరించిపోతుంది. పాములకు భయపడి చంపుతూ పోతే కప్పలు ఎక్కువైపోతాయి. పిల్లులు వద్దనుకుంటే ఎలుకలను తట్టుకోలేము. రాబందులు అంతరించిపోతే పర్యావరణానికి ఎంత నష్టమో తెలుస్తుంది. పులులు అంతరిస్తే జింకలు పొలాలలోకి వస్తాయి. వీటన్నింటికీ మూలకారణం మనిషి అత్యాశే. పారిశ్రామిక అభివృద్ధి మరియు ఆహార అభివృద్ధి కోసం మనిషి అడవులలోకి చొచ్చుకొని వస్తున్నాడు. దీని వలన అడవితో అనుబంధం వున్న జంతుజీవాలు జనావాసాల మధ్యకు వస్తున్నాయి.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం అడవులలో రైల్వే ట్రాకులు వేయడం వలన, ఆ ట్రాకులను దాటుతూ గడచిన మూడేళ్లలో రైళ్లు ఢీ కొని మరణించిన జంతువుల సంఖ్య 35,732. ఇందులో ఏనుగులు 65 వున్నట్లు దేశ రైల్వే మంత్రిత్వశాఖనే పార్లమెంటులో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఒక సంవత్సరంలో దాదాపు 200 వందల నుంచి 2000 రకాల అరుదైన జీవరాశులను మనం కోల్పోతున్నామని అంతర్జాతీయ లెక్కలు చెబుతున్నాయి. మన దేశంలో కూడా దేశ జంతువైన పెద్ద పులి మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. గత దశాబ్ద కాలంగా దాదాపు 1000 పులులను మనం కోల్పోయాము.ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40,000 ఏనుగులు అంతరించిపోయాయి. దట్టమైన అడువులు కోల్పోవడం వలన ఏనుగులు సమీప గ్రామాల్లోకి వస్తున్నాయి. దాదాపు 1100 ఖడ్గ మృగాలు మనుషుల చేతిలో అంతమయ్యాయి. అరుదైన పక్షి జాతులను కోల్పోతున్నాము. ఇంకా చిన్న చిన్న జంతువుల వధకు లెక్కే లేదు. ఇలా చెప్పుకుంటే పోతే మానవుడి చేతి నుంచి తప్పించుకున్న జంతువన్నదే లేదనేది అతిశయోక్తి కాదు.
ఈ భూమిపై జీవించడానికి మనకు ఎంత హక్కు వుందో సమస్త జీవరాశికి కూడా అంతే హక్కువుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక జీవరాశులు కనుమరుగైపోతున్నాయి.ఈ జంతుజాలం జీవించాలంటే అడవులు వుండాలి. అడువలను సంరక్షించుకోవాలి. ఇలా మన అభివృద్ధి పేరిట సరియైన ప్రణాళిక లేకుండా అడవులను, అడవి జంతువులు అంతరించిపోతే భవిష్కత్తులో జీవవైవిద్యమే దెబ్బ తింటుంది. దానివలన కేవ లం జంతుజాలానికే ఇబ్బంది ఉంటుందనుకుంటే మన పొరపాటే. భవిష్యత్తులో మానవాళికి కూడా తీవ్ర ముప్పు ఏర్పడుతుంది.(Source: Manatelangana)