సెప్టిక్ ట్యాంకు పేరుతో పిల్లాయిపల్లి కాలువలో పరిశ్రమ వ్యర్థ రసాయనల పారబోత

వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించిన రైతులు
చౌటుప్పల్ మండలంలోని మందోళ్లగూడెం గ్రామ పరిధిలోని పిల్లాయిపల్లి కాలువలో, పక్కనే ఉన్న వ్యవసాయ భూముల్లో ట్యాంకర్ల ద్వారా వ్యర్థ రసాయనాలు తీసుకొచ్చి పారబోస్తుండగా రైతులు శనివారం అడ్డుకున్నారు. రైతులెవరూ చూడకుండా ట్రాంకర్ల ద్వారా వ్యర్థాలు పారబోస్తుండగా సింగిల్ విండో డైరెక్టర్ బోరెం నర్సిరెడ్డి గమనించి రైతులతో కలిసి అడ్డుకున్నారు. రైతులు ట్యాంకర్ దగ్గరకు రావడాన్ని గమనించిన వాహన డ్రైవర్ వెంటనే వాల్ ను కట్టివేశాడు. దీంతో అనుమానం మరింత బలపడిన రైతులు వాల్ ను విప్పించి మరీ తనిఖీ చేశారు. అది పక్కగా వ్యర్థ రసాయనాలు అని తెలియడంతో అవేశంతో ట్యాంకర్ డ్రైవర్ ను గట్టిగా ప్రశ్నించగా స్థానిక విజన్ పరిశ్రమ నుంచి అని తెలపడంతో వెంటనే పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. జరిగిన సంఘటనపై రైతులు పరిశ్రమ నిర్వహకులను నిలదీశారు. దీంతో ఆ పరిశ్రమకు చెందిన ఓ ఉన్నతాధికారి పొరపాటు జరిగిందని క్షమణ చెప్పినట్లు తెలిసింది. ట్యాంకర్ పై సెఫ్టిక్ ట్యాంకు అని రాసి ఉంది. కానీ ఎవరికీ అనుమానం రాకుండా అందులో వ్యర్థ రసాయనాలు నింపుకొని కాలువలు, పంట భూముల్లో పారబోస్తున్నారు. ఇదిలావుండగాసెఫ్టిక్ ట్యాంకరు ముసుగులో చౌటుప్పల్ కు చెందిన ఓ వ్యక్తి ఎల్ బీ నగర్ కు చెందిన మరో వ్యక్తితో కలిసి ఈ వాహనాన్ని గుట్టుగా నడుపుతున్నట్లు తెలుస్తుంది. రైతులు ట్యాంకర్ ను పట్టుకుని పోలీసులు ట్యాంకర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
స్థానిక చెరువుల్లో చనిపోతున్న చేప పిల్లలు
పిలాయిపల్లి కాలువలో వ్యర్థ రసాయనాలు పారబోయడం వల్ల మూడు నెలల క్రితం చిన్న కొండూరు గ్రామంలోని చెరువులోని చేపలన్నీ చనిపోయాయి. ఆరు నెలల క్రితం తాళ్లసింగారం గ్రామ పరిధిలోని చెరువుల్లో కూడా చేపలు చనిపోయాయి. ఇలా నిత్యం జరుగుతున్నా సంబంధిత అదికారులు స్పందించి వ్యర్థ రసాయనాలు పారబోస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.