
ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసేముందు ఎవరినైనా అడిగారా?.. చంద్రబాబు పదవి ఇచ్చినంత మాత్రాన ఇంత వివక్షా? అని మీడియా సమావేశంలో సీఎం జగన్ ప్రశ్నించారు.
ఈసీ రమేష్ కుమార్ విచక్షణ కోల్పోయారు. ఎన్నికల వాయిదా ఆర్డర్ తయారవుతున్నట్లు ఈసీ సెక్రటరీకి కూడా తెలియదు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం ఎవరినైనా అడగాలి కదా? ఎవరైనా అధికారి పనిచేయాలంటే కులానికి, ప్రాంతానికి, రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ప్రభుత్వ అభిప్రాయం తీసుకోకుండానే నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నియమించిన వ్యక్తే నిమ్మగడ్డ రమేష్. బాబు పదవి ఇచ్చుండొచ్చు..మీ ఇద్దరిది ఒకటే సామాజికవర్గం కావొచ్చు. స్థానిక ఎన్నికలపై చంద్రబాబు అండ్ కో నానాయాగీ చేస్తున్నారు.
అధికారులను బదిలీ చేసే అధికారం ఈసీకి ఎక్కడిది. అధికారం 151 సీట్లున్న జగన్‌దా..? ఈసీదా..? ఇష్టం వచ్చినట్లు ఎన్నికలను వాయిదా వేస్తారా? ఎస్పీలను మార్చుతారు, కలెక్టర్లను మార్చుతారు. ఇండ్ల పట్టాలు ఇవ్వొద్దంటారు. ఇక సీఎంలు ఎందుకు..? ప్రభుత్వాలు ఎందుకు..? అన్ని ఈసీయే చేసుకోవచ్చుగా.! పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే ఎలా అడ్డుకుంటారు..? వైసీపీ స్వీప్ చేస్తోంది. 9వేలకు పైగా వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.ఈ శుభవార్త వారికి దుర్వార్త అయింది. దీన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు ఇంకా పడిపోతారని ఎన్నికలు వాయిదా వేశారని జగన్ మండిపడ్డారు.