
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత దేవాలయాల అభివృద్ధికి, భక్తుల వసతి, ఇతర సౌకర్యాల కోసం ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీలో దేవాదాయ శాఖ పద్దులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ పై చర్చలో భాగంగా పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి అల్లోల సమాధానమిస్తూ…యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాల అభివృద్ధికి పనులు చేపట్టడం జరిగింది. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం యాదగిరి గుట్ట ఆలయ పునర్నిర్మాణం, వసతుల కల్పనకు రూ. 700 కోట్లు ఖర్చు చేయడమైనది. వేములవాడ దేవస్థాన అభివృద్ధికి స్థల సేకరణకు ఇప్పటి వరకు రూ. 60 కోట్లు ఖర్చు చేసింది.
1427 దేవాలయాల నిర్మాణం, పునర్నిర్మాణం కొరకు సర్వ శ్రేయో నిధి నుండి రూ. 287 కోట్లు మంజూరు చేసిందన్నారు.యాదాద్రి ఆలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 350 కోట్లు, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి రూ. 50 కోట్లు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం అభివృద్దికి రూ. 50 కోట్లు, మిగిలిన దేవాలయాల అభివృద్ధికి గాను రూ. 50 కోట్లు బడ్జెట్ లో కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్రం అవతరించే నాటికి నిత్య ధూప దీప నైవేద్యానికి నోచుకోని 1805 దేవాలయాలకు నెలకు రూ.2500/- మంజూరు చేయబడేవి. కానీ రాష్ట్ర అవతరణ తరువాత తెలంగాణ ప్రభుత్వం నిత్య ధూప దీప నైవేద్యం పథకం కింద రూ. 2,500 నుంచి రూ. 6,000 పెంచడం జరిగింది. అంతేకాకుండా కొత్తగా మరో 1840 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకాన్ని వర్తింపజేసిందని మంత్రి ఇంద్రకరణ్ తెలిపారు. మొత్తం 3645 దేవాలయాలకు ప్రతి నెల 6000/- రూపాయలు ఇస్తున్నట్లు చెప్పారు.
దేవాలయాల ఆర్థిక వనరుల నుండి చెల్లించబడుతున్న 2744 అర్చకులు, ఆలయ ఉద్యోగులకు గతంలో తక్కువ వేతనాలు ఇచ్చేవారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రాంట్-ఇన్- ఎయిడ్ కింద 108 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన దేవాలయాలలో ఆన్-లైన్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. తెలంగాణ ప్రభుత్వం భోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని దేవాలయాలకు ప్రతి సంవత్సరం రూ. 15 కోట్లు మంజూరు చేస్తుందని తెలిపారు. అదేవిధంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 75 కోట్లు మంజూరు చేసింది. గతంలో గోదావరి, కృష్ణ పుష్కరాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించి ప్రజల మన్ననలను పొందడం జరిగిందన్నారు.
దేవాలయ భూముల పర్యవేక్షణకు, ఆలయ భూములు పరాధినం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోబడుతున్నవని మంత్రి ఇంద్రకరణ్ తెలిపారు. ఇప్పటివరకు 1025 ఎకరాల ఆలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. దేశ, విదేశాలలో వుండే భక్తుల సౌలభ్యం కొరకు ఆన్-లైన్ ద్వారా ఆర్జిత సేవలు, ప్రసాదం, తలంబ్రాలు డాలర్ అమ్మకాలను ప్రారంభించినట్లు చెప్పారు. 2020-21 బడ్జెట్ లో అర్చకుల జీతాలకు గాను రూ.120 కోట్లు, బోనాల ఉత్సవాలకు రూ.15 కోట్లు, ఇతర పనులకు 50 కోట్లు మొత్తం రూ.185 కోట్లు ప్రతిపాదించడమైనదన్నారు.