
నైజీరియా వాణిజ్య రాజధాని లాగోస్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మరణించారు. నౌకాదళ కేంద్రం ఉన్న అమువో ఓడోఫిన్ ప్రాంతంలో జరిగిన పేలుడు ధాటికి 50కిపైగా భవనాలు కుప్పకూలాయని, కొన్నింటికి మంటలంటుకున్నాయని ఆ దేశ జాతీయ అత్యవసర నిర్వాహణ సంస్థ ప్రతినిధి తెలిపారు. సమీపంలోని ఆయిల్ పైప్‌లైన్‌కు మంటలు వ్యాప్తిస్తుండటంతో మరిన్ని పేలుళ్లు, నష్టం జరిగే అవకాశమున్నదన్నారు.
శిథిలాల కింద చిక్కుకుని ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు చనిపోయారని, ఇప్పటి వరకు 15 మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. ఓ స్కూలు భవనం శిథిలాల్లో చిక్కుకున్న పిల్లలందరినీ రక్షించినట్లు తెలిపారు. పలు భవనాల శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నదన్నారు. ఈ భారీ పేలుడుకు కారణం ఏమిటన్నది అధికారులు ఇంకా నిర్ధారించలేదు. 2002 జనవరిలో లాగోస్‌లోని సైనిక ఆయుధాగారంలో బాంబులు పేలిన ఘటనలో వెయ్యి మందికిపైగా పౌరులు చనిపోయారు.