
తెలంగాణలో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయని, అందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. విదేశాలకు వెళ్లివచ్చిన వారికి మాత్రమే కరోనా సోకిందని పేర్కొన్నారు. కరోనా వైరస్ కేసులకు సంబంధించి రాతపూర్వక బులెటిన్లు విడుదల చేస్తామని మీడియా సమావేశంలో మంత్రి వివరించారు.
ఇప్పటి వరకు తెలంగాణలో ఏ ఒక్కరికీ కరోనా సోకలేదు. విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించాం. దుబాయ్, ఇటలీ, నెదర్లాండ్, స్కాట్లాండ్, ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తులకు పాజిటివ్ ఉంది. వైరస్ అనుమానం ఉన్నవారు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలి. మొదటి కరోనా పాజిటివ్ వ్యక్తితో పాటు రెండవ, మూడవ కరోనా పాజిటివ్ వ్యక్తులతో సంబంధం ఉన్న ఎవరికీ వైరస్ సోకలేదు. కరోనా అదుపుకోసం వైద్య సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారు.
వరంగల్‌లో కరోనా వైరస్ టెస్ట్ ల్యాబ్ కోసం కేంద్రం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం ఆరు ల్యాబ్‌లు కరోనా టెస్టులు చేస్తున్నాయి. అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో థర్మల్ స్క్రీనింగ్ సదుపాయం ఏర్పాటు చేశాం. చైనా, ఇరాన్, ఇటలీ, కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ నుంచి వచ్చే వ్యక్తులకు విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేస్తున్నాం. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం.
కరోనా లక్షణాలు లేనివారిని క్వారంటైన్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే దూలపల్లి, వికారాబాద్‌లోని 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచుతాం. ఇప్పటి వరకు దాదాపు 221 మందిని క్వారంటైన్‌లో ఉంచాం. కరోనా వైరస్ కట్టడికి నిరంతరం పనిచేస్తున్నాం. మహారాష్ట్ర నుంచి వచ్చే వారిని కూడా పరీక్షిస్తున్నాం. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు.