
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నివేదికలు, ఖాతాలను మదింపుచేసి, వాటి పనితీరుపై పార్లమెంట్‌కు నివేదికలు సమర్పించే పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ ఎంపికయ్యారు. జాతీయస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును మెరుగుపరిచేందుకు మార్గదర్శకంగా నిలిచే ఈ పార్లమెంటరీ కమిటీలో లోక్‌సభ నుంచి 15, రాజ్యసభ నుంచి ఏడుగురు కలిపి మొత్తం 22 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రాధాన్య ఓటు ఆధారంగా రెండు సభల నుంచి కమిటీ సభ్యులను ఎన్నుకొంటారు.
సంతోష్ తెలంగాణ నుంచి ఈ కమిటీకి ఎంపికైన తొలి ఎంపీ కావడం విశేషం. కమిటీ చైర్మన్‌ను లోక్‌సభ స్పీకర్ నియమిస్తారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలను అధ్యయనం చేయడం, వాటి ఖాతాలను పరిశీలించడంతో పాటు, మరింత మెరుగ్గా పనిచేసేందుకు వీలుగా ఈ కమిటీ పార్లమెంట్‌కు నివేదికలు ఇస్తుంది. ప్రాధాన్యం కలిగిన పార్లమెంటరీ కమిటీకి ఎంపికకావటంపై ఎంపీ సంతోష్ సంతృప్తి వ్యక్తంచేశారు. తన బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు.