
రోడ్డేక్కితే చాలు.. నోటికి బట్టకట్టుకోనిదే కుదరదు. పొగ.. దుమ్ము.. ధూళికణాలు.. నేరుగా శ్వాననాళంలోకి చేరిపోతాయి. తలతిరగడం, చికాగుగా అనిపించడం సహజం. ఇక రణగోణ ధ్వనుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. చెవులు దద్దరిల్లేలా వినిపించే ధ్వనికాలుష్యం..హారన్సౌండ్స్ ఉక్కిరిబిక్కిరి చేయడం మామూలే.. కాని కరోనా ప్రభావంతో గ్రేటర్లో కాలుష్య తీవ్రతలు తగ్గినట్లుగా తెలుస్తున్నది. వాహనాలు రోడ్డెక్కకపోవడంతో, ట్రాఫిక్ రద్దీ అంతగా లేకపోవడంతో కాస్త ప్రశాంత వాతవరణం నెలకొన్నది. గత వారం రోజుల్లో నమోదవుతున్న కాలుష్య తీవ్రతలు ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి.
కరోనా వ్యాప్తిని ఆరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టం చేయడం, ఆకస్మిక సెలవులు ప్రకటించిన విష యం తెలిసిందే. దీంతో జనం ఇండ్లకే పరిమితంకావడం తో జనసంచారం తగ్గింది. నగరంలో చాలామటుకు రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అంచనాల ప్రకారం 50 శాతానికి పైగా కాలుష్యం కేవలం వాహనాల నుంచి పోగవుతున్నది. వాహనాల సంఖ్య పెరుగుతుండటంతోనే కాలుష్య తీవ్రతలు పెరుగుతున్నట్లుగా అధ్యయనాల్లో తేలింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వాహనాల రద్దీ తగగ్గడంతో నగరంలో వాయు కాలుష్యంతో పాటు శబ్దకాలుష్య తీవ్రతల్లో తేడాలు నమోదు చేసుకుంటున్నాయి. నగరంలోని మూడు కాలుష్య నమోదు కేంద్రాల్లో నమోదైన గణాంకాలను బట్టి గ్రేటర్లో వాయుకాలుష్యం గణనీయంగా తగ్గినట్లుగా నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని సనత్‌నగర్, బహదూర్‌పుర, పాశమైలారం ప్రాంతాల్లో వాయు కాలుష్య గణాంకాలను పీసీబీ నమోదుచేసింది.
ఈ మూడు కేంద్రాల్లోని కాలుష్యం ఆధారంగా ఏక్యూఐ సూచీలో 74 స్కోర్ నమోదయ్యింది. మిగతా నగరాల్లో వందకు మించి నమోదుకాగా, హైదరాబాద్‌లో 75 దాటకపోవడం విశేషం. నగరవాసుల్లో చాలా మంది బయటికొచ్చే సాహసం చేయకపోవడం, ఇక విద్యాసంస్థల బస్సులు, ఇతర వాహనాలు సైతం రోడెక్కకపోవడంతో కాలుష్య తీవ్రతలు తగ్గినట్లుగా పీసీబీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. పీసీబీ పరిశీలించిన మూడు స్టేషన్లలో నమోదైన కాలుష్య తీవ్రతల్లో గణనీయంగా మార్పులు కనిపించాయి. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో వాయువుల నాణ్యత సాధారణ స్థాయిలో ఉండటం, మిగతా నగరాల్లో తీవ్రత అత్యధికంగా ఉండటం గమనార్హం.