
దేశవ్యాప్తంగా 75 జిల్లాలను లాక్‌డౌన్ చేయనున్నారు. కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు అయిన జిల్లాల్లో పూర్తి నిషేధ ఆజ్ఞలు అమలు చేయనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన క్యాబినెట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇవాళ అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య ఆరుకు చేరుకున్నది. తాజాగా బీహార్, ముంబైలో ఒక్కొక్కరు మరణించారు. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రజలు పాటిస్తున్నారు. భారత్‌లో కోవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య 341కి చేరుకున్నది.
రోమ్ నుంచి వచ్చిన విమానం ఇవాళ ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఆ విమానంలో 263 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులను అందర్నీ ఐటీబీపీ చావ్లా క్వారెంటైన్ సెంటర్‌కు తీసుకువెళ్లారు. థర్మల్ స్క్రీనింగ్, ఇమ్మిగ్రేషన్ చెక్ చేశారు. ఆ విమానంలో ఉన్న సిబ్బందికి కూడా క్వారెంటైన్ ఆదేశాలు జారీ చేశారు.