
కరోనా వైరస్ కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటివరకూ ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. పదిమంది కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని హెచ్చరించారు. రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ కూలీలు మాత్రం పొలం పనులకు వెళ్లినప్పుడు రెండు మీటర్ల దూరం ఉండేట్లు చూసుకోవాలన్నారు.
గోడౌన్లు, ఫ్యాక్టరీలు అతి తక్కువ సిబ్బందితో నడపాలని సూచించారు. మార్చి 29 వ తేది నాటికి పూర్తిగా రేషన్ అందుబాటులోకి ఉంటుందని, రేషన్ ఫ్రీగా ఇవ్వడమేక కాకుండా కేజీ పప్పును ఉచితంగా అందిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఏప్రిల్ 4న రూ.1000 అందిస్తామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు విధిగా 14 రోజులు ఇళ్లలోనే ఉండాలన్నారు. అందరూ 14 రోజుల పాటు ఇళ్లలోంచి కదలొద్దని కోరారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. మార్చి 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ పేర్కొన్నారు.