
కరోనా మహమ్మారి రోజరోజు పెరిగిపోతుండంటంతో ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యాలయాలు, కార్యాలయాలు, బార్లు, హోటళ్లు, సినిమా హాళ్లు మొదలైనవి అన్నీ మూతపడ్డాయి. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికే తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో అన్ని రకాల పరీక్షలు వాయిదాపడ్డాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది.
మార్చి 31 నుంచి ప్రారంభం కావాల్సిన 10వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించింది. కరోనా వైరస్ ఏపీలో సైతం చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్నే మార్చి 31 తర్వాత ప్రకటించనున్నారు. కాగా, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది.