
ప్రపంచదేశాలను ‘కరోనా’ మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా రోజురోజుకూ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఆయా దేశాలు కరోనాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4,21,413 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 18,810 మంది మరణించారు. 1,08,388 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
అత్యధికంగా ఇటలీలో 6,820 మంది కరోనా కారణంగా మరణించారు. నిన్న ఒక్కరోజే ఆ దేశంలో 740 మంది మృత్యువాత పడ్డారు. ఇటలీ తర్వాత చైనాలో 3,277 మంది మరణించగా, స్పెయిన్‌లో 2,991, ఇరాన్‌లో 1,934 మంది, ఫ్రాన్స్‌లో 1,100 మంది, అమెరికాలో 698 మంది, యూకేలో 422 మంది, నెదర్లాండ్స్‌లో 276 మంది, బెల్జియంలో 122 మంది, స్విట్జర్లాండ్‌లో 122 మంది, దక్షిణకొరియాలో 120 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు.
దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. పౌరులంతా గృహనిర్బంధంలో ఉండాలని ఆయా దేశాధ్యక్షులు ప్రకటన విడుదల చేశారు. సమాజాన్ని కాపాడుకోవాలంటే ఈ నిబంధన పాటించాలని వారు తెలిపారు. హెల్త్ ఎమర్జెన్సీ కారణంగా ప్రపంచమంతా కుదేలవుతోంది. అయినప్పటికీ ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇంతకన్నా మంచి మార్గం లేదని ఆయా దేశాలు భావిస్తున్నాయి.