
వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21 తొలి మూడు నెలలకు ఓటాన్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్థిక ప్రగతి కుదేలైందని మంత్రిమండలి అభిప్రాయ పడింది. ఆర్థికంగా దేశానికి, రాష్ట్రాలకు కోలుకోలేని దెబ్బ తగిలిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. నిరోధక చర్యలపై అవసరమైన ఖర్చుకి వెనకాడవద్దని జగన్ సూచించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను అక్కడే ఉంచి భోజనం, వసతి కల్పించేలా ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని కేబినెట్ సమావేశంలో జగన్ ఆదేశించారు.
కరోనా నియంత్రణకు కేబినెట్ సబ్ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆరుగురు మంత్రులు, 10 మంది ఐఏఎస్‌లతో కమిటీని ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై కేబినెట్ సబ్ కమిటీకి వైద్యశాఖ ఉన్నతాధికారులు వివరించారు. కరోనా పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం సబబు కాదని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్నినాని తెలిపారు. కరోనా నివారణకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోందని చెప్పారు. ఏప్రిల్ 14 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగిస్తామన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్ వద్ద రూ.2కోట్ల అత్యవసర నిధి ఉంచామని వివరించారు.