
మహమ్మారి విస్తరణకు బ్రేకులు వేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంటే.. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఓ ఎక్సైజ్ సీఐ మాత్రం తనకు ఏ నిబంధనలు పట్టవన్నట్లుగా వ్యవహరించాడు. ఎక్కడైనా అక్రమంగా మద్యం అమ్మకాలు జరిగితే పట్టుకోవాల్సింది పోయి ఏకంగా తానే బాటిళ్ల కొద్ది మద్యాన్ని తన కారులో తరలిస్తూ పట్టుబడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అనపర్తి ఎక్సైజ్ సీఐ రెడ్డి త్రినాథ్ తన కారులో అక్రమంగా మద్యం బాటిళ్లు తరలిస్తుండగా.. అనపర్తి ఎమ్మెల్యే, స్థానికులు కలిసి ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ విషయం ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి దృష్టికి వెళ్లడంతో ఆయన సీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు రూ.5 లక్షలు జరిమానా కూడా విధించాడు. త్రినాథ్‌పై శాఖాపరమైన విచారణ కూడా జరుగుతుందని, ఇలాంటి అక్రమాలకు ఎవరు పాల్పడ్డా కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.