
ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. తాజాగా మహారాష్ట్రలో మరో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 230కి చేరింది. కొత్తగా నమోదైన ఐదు కరోనా పాజిటివ్ కేసుల్లో నలుగురు ముంబైకి చెందినవారు కాగా, ఒకరు పుణె వాసి అని మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదిలావుంటే కరోనా మరణాలు కూడా మహారాష్ట్రలోనే ఎక్కువగా సంభవించాయి. ఇప్పటికే 10 మంది మరణించారు. కాగా, మహారాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటికి 4,538 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,876 మందికి నెగెటివ్‌గా తేలింది. మరో 220 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 19,161 మంది హోమ్ క్వారెంటైన్లో, 1,224 మంది క్వారెంటైన్ కేంద్రాల్లో ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.