24 గంటల్లో 227 పాజిటివ్‌ కేసులు నమోదు

గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 227 కోరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 1,237 మంది కరోనా బారిన పడ్డారని తెలిపింది. ఇతర దేశాల వైద్య సాయం కోరుతున్నాం.. వైద్యులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మీడియా సమావేశంలో కరోనాపై ఆరోగ్యశాఖ అధికారులు పలు వివరాలు వెల్లడించారు.
కరోనాపై చేస్తున్న యుద్ధంలో మనం విజయం సాధించాలి. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని పనిచేస్తున్నాం. వలస కూలీలకు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరాం. అవసరమైతే క్వారంటైన్‌లో ఉంచాలని రాష్ట్రాలను కోరాం. కరోనా సోకిన వారితో కలిసిన వ్యక్తులను గుర్తిస్తున్నాం. మాస్క్‌లు, శానిటైజర్లు, వైద్య పరికరాల కొరత లేకుండా చూస్తున్నాం. దక్షిణ కొరియా, టర్కీ, వియత్నాం నుంచి వైద్య పరికరాలు తెప్పిస్తున్నాం. వీటిని సరఫరా చేసే కంపెనీలను విదేశాంగ శాఖ గుర్తించింది.
ఎన్‌95 మాస్క్‌ల తయారీని పెంచేందుకు దేశీయ కంపెనీలతో కలిసి డీఆర్‌డీవో పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా వైద్యులకు ఆన్‌లైన్‌ ద్వారా కరోనా చికిత్సపై శిక్షణ ఇస్తున్నాం. 15వేల మంది నర్సులకు ఆన్‌లైన్‌లోనే శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటి వరకు 42,788 నమూనాలను పరీక్షించాం. మొత్తం 123 ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. 49 ప్రైవేట్‌ ల్యాబ్‌లకు అనుమతినిచ్చాం. ఆదివారం ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో నిర్వహించిన పరీక్షల్లో 399 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ వివరించింది.