
పచ్చని కల్యాణ మండపం.. మిరిమిట్లు గొలిపేలా విద్యుద్దీపాలంకరణ లేకుండానే శ్రీసీతారాముల కల్యాణోత్సవం ఏప్రిల్ 2 (గురువారం) జిల్లావ్యాప్తంగా జరుగనుంది. కరోనా వ్యాప్తి చెందకుండా భక్తులకు ఆలయాల్లో దర్శనాలు కల్పించడం లేదు. ఆయా ఆలయాల ఎండోమెంట్ ఆఫీసర్స్(ఈఓ), మేనేజర్స్ పర్యవేక్షణలో అర్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ రాములోరి కల్యాణతంతు నిర్వహించనున్నారు. నల్లగొండలోని రామగిరిలో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం వేడుకలు ప్రారంభమయ్యాయి. బుధవారం రాత్రి 7గంటల తర్వాత ఎదుర్కోళ్లు, గురువారం ఉదయం 10గంటలకు ఆలయం లోపల కల్యాణం నిర్వహించనున్నట్లు ఈఓ మోకిరాల రాజేశ్వరశర్మ తెలిపారు.
‘అర్చకుల సమక్షంలోనే జరుపాలి’ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో అర్చకుల సమక్షంలోనే శ్రీరామనవమి వేడుకలు నిర్వహించాలని ధూప, దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ, అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, ధూప, దీప నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.ప్రసాద్‌శర్మ మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తారని పేర్కొన్నారు.