
నల్లగొండ జిల్లాలో తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసులు 6 నమోదు అయ్యాయి. నల్లగొండలో ఐదుగురికి, మిర్యాలగూడలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ కొండల్ రావు తెలిపారు. ఈ ఆరుగురు మర్కజ్ భవన్‌లో మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారేనని ఆయన చెప్పారు. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. ఇక వీరి కుటుంబ సభ్యులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి క్వారంటైన్‌కు తరలించినట్లు డీఎంహెచ్‌వో పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల నమూనాలను కూడా సేకరించి గాంధీ ఆస్పత్రికి పంపిస్తామన్నారు. పాజిటివ్ కేసులు నమోదైన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో మరో ఆరుగురి రిపోర్టు రావాల్సి ఉందన్నారు డీఎంహెచ్‌వో. జిల్లా ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వైద్య సిబ్బంది కూడా తగు జాగ్రత్తలతో విధులు నిర్వర్తించాలని డాక్టర్ కొండల్ రావు సూచించారు.