దేశ ప్రజలకు ప్రధాని మోదీ వీడియో సందేశం

లాక్‌డౌన్‌కు దేశ ప్రజలు ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. జనతా కర్ఫ్యూ రోజున కరోనా పోరులో సేవలందిస్తున్నవారికి చప్పట్లతో దేశ ప్రజలు కృతజ్ఞతలు తెలిపిన తీరు ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని అన్నారు. దేశమంతా కరోనాకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేస్తోందని, ఇది చారిత్రాత్మకమైందని కొనియాడారు. జనతా కర్ఫ్యూ స్ఫూర్తిని మరోసారి ప్రదర్శించాలని శుక్రవారం ఉదయం ఆయన వీడియో సందేశంలో పిలుపునిచ్చారు. ‘చాలా మంది లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లో ఒంటరిగా ఉండి ఏం చేయాలంటున్నారు. ఇంకా లాక్‌డౌన్‌ ఎన్ని రోజులు కొనసాగుతుందని ప్రశ్నలు వేస్తున్నారు. మనం ఒంటరిగా లేము. 130 కోట్ల మంది ఐక్యంగా ఉన్నాం. ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు మన బాటలోనే నడుస్తున్నాయి. ప్రజలే దేవుళ్లుగా పని చేయాలి.. అదే మనకు మనోస్థైర్యాన్ని ఇస్తుంది. భారతీయులంతా ఏకమై కరోనాను తరిమికొడతారు. కరోనా వల్ల ఎక్కువగా నష్టపోయింది పేదవాళ్లే. వారి బాగుకోసం కూడా మనం కృషి చేయాలి. ప్రతిఒక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను జయించినట్లే. అంధకారంలో ఉన్నామన్న భావన నుంచి బయటకురావాలి. ఏప్రిల్‌ 5 న 130 కోట్ల మంది తమ శక్తిని చూపాలి. ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేయాలి. కొవ్వొత్తులు, దీపం లేదా మొబైల్‌ ఫ్లాష్‌ లైట్లు ఆన్‌ చేయాలి. ఆ దీపం వెలుగు మనకు స్ఫూర్తి నింపాలి. మనం ఒంటరికాదు అనే భావన కల్పించాలి’అని ప్రధాని పేర్కొన్నారు.