
గంగా నదిలో నీటి నాణ్యత పెరిగింది. లాక్‌డౌన్ నేపథ్యంలో యూపీలోని కాన్పూర్ వద్ద పరిశ్రమలను మూసివేయడంతో.. అక్కడ గంగా నది నీరు తేటతెల్లగా కనిపిస్తున్నది. ట్యానరీల కలుషితాలతో గంగా నది కాన్పూర్ ప్రాంతంలో అపరిశుభ్రంగా ఉండేది. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో కాన్పూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వేలాది తోలు పరిశమ్రలు మూతపడ్డాయి. సాధారణంగా గంగా నదిలో ట్యానరీల మలినాలు వచ్చి చేరేవి. ఇప్పుడు ఆ కాలుష్యం తగ్గడంతో తళతళలాడుతూ గంగా నది పరవళ్లు తొక్కుతున్నది. పవిత్ర గంగా నది నీటి నాణ్యతో సుమారు 50 శాతం పెరిగినట్లు వారణాసిలోని బెనరాస్ యూనివర్సిటీలో కెమికల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ పీకే మిశ్రా తెలిపారు. నీటి కాలుష్యమే కాదు.. వాయు కాలుష్యం కూడా అన్ని ప్రాంతాల్లో పడిపోయింది. రెండు రోజుల క్రితం జలంధర్‌లో వాయు కాలుష్యం తగ్గడం వల్ల సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాలయ పర్వత్ర శ్రేణులు స్థానికులకు కనిపించాయి.