
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వివిధ రంగాలకు చెందిన సంస్థలు, కంపెనీలు, కార్యాలయాలు అన్ని బంద్ అయ్యాయి. లాక్ డౌన్ తో చాలా వరకు పరిశ్రమలను కూడా మూసివేశారు. పరిశ్రమల మూసివేత ఫలితంగా..వాటి నుంచి వచ్చే వ్యర్థాలు ఆగిపోయాయి. ఎక్కడైనా పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు ఏ నదిలోనో, సరస్సుల్లో కలుస్తుంటాయి. పరిశ్రమల మూసివేత వల్ల గంగా నదిలోకి వ్యర్థాలు రాకపోవడంతో..నదిలోని నీరు రోజురోజుకీ శుద్ది అవుతోంది. వారణాసిలో గంగా నది పరివాహక ప్రాంతంలో నీటి నాణ్యత పెరిగింది. ఈ విషయాన్ని బెనారస్ హిందూ యూనివర్సిటీ-ఐఐటీలో కెమికల్ ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పీకే మిశ్రా తెలిపారు. గంగానదిలో లాక్ డౌన్ తర్వాత నీటి నాణ్యత 40-50 శాతం పెరిగిందని మిశ్రా పేర్కొన్నారు.