
భారత్‌లో నోవెల్ కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 79కి చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ వైరస్ సంక్రమించిన వారి సంఖ్య 3374కు చేరుకున్నది. వైరస్‌పై విజయం సాధించేందుకు భౌతిక దూరాన్ని పాటించాలని అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా 274 జిల్లాలు ప్రభావానికి గురైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్నటి నుంచి కొత్తగా 472 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. గత 24 గంటల్లో 11 మంది చనిపోయారని, 267 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. లాక్డౌన్లో భాగంగా విధించిన అన్ని ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పుణ్యా సలిలా శ్రీవాత్సవ్ తెలిపారు. నిత్యావసర వస్తువుల సరఫరా బాగుందన్నారు.