కొవ్వొత్తి వెలిగించిన సీఎం కేసీఆర్‌

కరోనాపై పోరుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీపాలు వెలిగించారు. సరిగ్గా రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్‌ బల్బులను ఆర్పి కొవ్వొత్తి వెలిగించి సంఘీభావం ప్రకటించారు. ప్రగతిభవన్‌లో మంత్రి ఈటెల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఉన్నతాధికారులు కూడా కొవ్వొత్తులు వెలిగించి పట్టుకున్నారు. మరోవైపు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కుటుంబసభ్యులతో కలిసి కొవ్వొత్తి వెలిగించారు. కరోనాపై దేశం సమిష్టిగా చేస్తున్న యుద్ధానికి సంఘీభావంగా దీపాలు వెలిగించాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలను కోరిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.