
భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 693 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశవ్యాప్తంగా 4067 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు.
మీడియా సమావేశంలో లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. 291 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. గత 24 గంటల్లో 30 మంది మహమ్మారి కారణంగా చనిపోవడంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 109కు చేరింది. మొత్తం బాధితుల్లో 1445 కరోనా కేసులు మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారివే. కరోనా బాధితుల్లో 76శాతం పురుషులు ఉండగా..24శాతం మంది మహిళలు ఉన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఇప్పటికే రూ.1100 కోట్లు విడదల చేయగా.. అదనంగా మరో 3వేల కోట్లను ఇవాళ రాష్ట్రాలకు విడుదల చేశామని పేర్కొన్నారు.