సూర్యాపేటలో ఆరు కరోనా పాజిటీవ్ కేసులు..

సూర్యాపేట జిల్లాలో సోమవారం 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల ఢిల్లీలోని మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. అతడి ద్వారా గ్రామంలోని మరో ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. బాధితులందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించడంతో పాటు వారి కుటుంబసభ్యలకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, జిల్లాలో కొత్త కేసులు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారు ఎవరైనా ఉంటే.. స్వచ్ఛందంగా ముందుకు రావాలని, వారికి పరీక్షలు నిర్వహించి కరోనా సోకిందని తేలితే తగిన చికిత్స అందిస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు.