పాకెట్ మనీని పోలీసు సంక్షేమ నిధికి ఇవ్వడం గర్వకారణం : నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాధ్

  • పోలీస్ సంక్షేమ నిధికి కూచిపూడి కళాకారిణి చిన్నారి సాన్వి ఆర్థిక సహాయం
  • – కరోనా కట్టడిలో పోలీసుల కృషికి సెల్యుట్ చేసి ఆర్థిక సహాయం అందించిన చిన్నారి
  • – పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న సాన్విని అభినందించిన ఎస్పీ
  • – పెద్ద మనస్సుతో చిన్నారి చిట్టి సాయం స్పూర్తివంతం

విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాల రక్షణ కోసం ఎండనక, వాననక పని చేస్తూ కరోనా కట్టడిలో కీలకంగా పని చేస్తున్న పోలీసుల కృషి ఆ చిన్నారిని ఆలోచింపజేసింది….. అంతే…. కరోనా కట్టడికి కోసం నిత్యం రోడ్లపై విధి నిర్వహణ చేస్తూ ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తున్న పోలీసులకు తన వంతు బాధ్యతగా ఏదైనా చేయాలని భావించింది నల్లగొండకు చెందిన కూచిపూడి కళాకారిణి, 13 ఏళ్ల చిన్నారి నామిరెడ్డి సాన్వి…..

సోమవారం నల్లగొండ జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో తన తల్లితండ్రులు నామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సుష్మ, కూచిపూడి గురువు రమణ సిద్దిలతో కలిసి జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ ను కలిసి తన తల్లితండ్రులు తరచూ ఇచ్చే పాకెట్ మనీ మొత్తం 10 వేల రూపాయలు పోలీస్ సంక్షేమ నిధికి అందచేసింది.

ఈ సందర్భంగా ఎస్పీ రంగనాధ్ మాట్లాడుతూ చిన్నతనం నుండే క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేస్తూ కూచిపూడి కళాకారిణిగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనల ద్వారా నల్లగొండ జిల్లా కీర్తిని చాటడం జిల్లాకే గర్వకారణమని అన్నారు. చిన్న వయసులోనే తనవంతు బాధ్యతగా సమజాభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే విధంగా పోలీసుల సంక్షేమ నిధికి తన పాకెట్ మనీ పదివేల రూపాయలు అందించడం అభినందనీయమని చెప్పారు. చిన్నతనం నుండే క్రమశిక్షణ అలవర్చుకోవడం ద్వారా విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోగలుగుతారని ఎస్పీ చెప్పారు. పోలీస్ సంక్షేమ నిధికి సాన్వి పెద్ద మనస్సుతో అందించిన చిన్ని సాయం ఎందరో చిన్నారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీమతి సి. నర్మద, పోలీస్ అధికారులున్నారు.