
కరోనా వైరస్ సోకిన రోగులను బాగు చేసేందుకు వైద్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తోందని సీఎం కేసీఆర్ కొనియాడారు. ప్రగతి భవన్లో కరోనా ప్రభావం, లాక్డౌన్ అమలుపై అత్యున్నత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కరోనా యుద్ధంలో అందరికి మించి.. తమ ప్రాణాలకు తెగించి.. తమకు కూడా వైరస్ సోకోచ్చు అనే బాధ ఉండి.. వాటన్నింటిని పక్కన పెట్టి మన వైద్యులు అద్భుతమైన పని చేస్తున్నారు. హాస్పిటల్లో పని చేస్తున్న స్వీపర్ నుంచి మొదలుకొని డైరెక్టర్ వరకు వైద్య సిబ్బంది అందరికి.. రెండు చేతులెత్తి నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున వారికి దండం పెడుతున్నా. పాదాభివందనం చేస్తున్నా అని సీఎం తెలిపారు. వాళ్ల ధైర్యం గొప్పది. వారు గొప్పవారు. డాక్టర్లు, నర్సులు, ఫార్మాసిస్టులకు ఎంత దండం పెట్టినా తక్కువే. వారి సమయాన్ని త్యాగం చేసి గొప్ప పని చేస్తున్నారు అని సీఎం పేర్కొన్నారు.