తెలంగాణలో కొత్తగా 30 కరోనా పాజిటివ్ కేసులు

కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం మళ్లీ 30 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు  నమోదైన కరోనా కేసుల సంఖ్య 364కు చేరుకుంది. అందులో ఎక్కువ మంది ఢిల్లీ మర్కజ్‌తో సంబంధం ఉన్నవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. మిగిలినవారు వివిధ దేశాల నుంచి వచ్చిన వారు, వారి కుటుంబీకులు, స్థానికంగా ఎలాంటి కాంటాక్ట్‌తో సంబంధం లేకుండా సోకిన వారూ ఉన్నారు. నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటివరకు 11 మంది చనిపోయారు. మరో 45 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వారిలో సోమవారం 12 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ డిశ్చార్జి అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇప్పటివరకు అత్యధికంగా హైదరాబాద్‌ నుంచే 161 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. ఆ తర్వాత నిజామాబాద్‌ జిల్లాలో 27 కేసులు నమోదు కావడం గమనార్హం. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 24 కేసులు నమోదయ్యాయి. సోమవారం గద్వాలలో ఏకంగా 13కు కరోనా కేసుల సంఖ్య పెరిగింది. సూర్యాపేటలో 8కి చేరుకుంది. కాగా, రాష్ట్రంలో కరోనా కేసుల నివారణ, నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. ఏ జిల్లాలో పాజిటివ్‌ కేసులు వచ్చినా గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారని బులెటిన్‌ తెలిపింది.