3 కోట్ల హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్ర‌ల‌ను కొన్న అమెరికా..

ఇండియా నుంచి సుమారు 3 కోట్ల హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్ర‌ల‌ను ఖ‌రీదు చేసిన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.  క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి విష‌యంలో యాంటీ మ‌లేరియా డ్ర‌గ్ కొంత మెరుగ్గానే ప‌నిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే భార‌త్ త‌యారీ చేస్తున్న ఆ మందుల‌ను త‌మ‌కు ఇవ్వాల‌ని ఇటీవ‌ల ట్రంప్ కోరారు. వాస్త‌వానికి ఆ డ్ర‌గ్‌పై నిషేధం ఉన్నా.. అమెరికా విజ్ఞ‌ప్తి మేర‌కు భార‌త్ ఆంక్ష‌ల‌ను పాక్షికంగా స‌డ‌లించింది.  ప్ర‌ధాని మోదీని సాయం కోరిన‌ప్పుడు ఆయ‌న పాజిటివ్‌గా స్పందించార‌ని,  మోదీ గ్రేట్ అని ట్రంప్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. గ‌త వారం ఈ ఇద్ద‌రూ హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్ర‌ల గురించి ఫోన్‌లో మాట్లాడుకున్నారు.  అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ కూడా హైడ్రాక్సీక్లోరోక్వీన్ మందుల‌ను క‌రోనాకు ట్రీట్మెంట్‌గా వాడ‌నున్న‌ది. న్యూయార్క్‌లో ఆ డ్ర‌గ్‌ను సుమారు 1500 పేషెంట్ల‌పై ప్ర‌యోగించిన‌ట్లు తెలుస్తోంది. కొంత వ‌ర‌కు పాజిటివ్ రిజ‌ల్ట్స్ వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు.  క్లోరోక్వీన్‌పై ఇండియా ఎందుకు బ్యాన్ పెట్టిందంటే, వాళ్ల‌కు ఆ డ్ర‌గ్ అవ‌స‌రం ఉంది కాబట్టి, కానీ మ‌న కోసం వాళ్లు ఆ బ్యాన్‌ను ఎత్తివేశార‌ని ట్రంప్ ఫాక్స్ మీడియాతో తెలిపారు.