
కరోనా వయోధికులపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతున్నది. భారత్లో సంభవిస్తున్న కరోనా మరణాల్లో 60, ఆపైన వయస్కులే అధికంగా ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. అదే పాశ్చాత్యదేశాల్లో 80, ఆపైన వయస్కులు కరోనా వల్ల మరణిస్తున్నారు. దేశంలో ఈ నెల ఆరో తేదీ వరకు నమోదైన 4,097 పాజిటివ్ కేసులు, 109 మరణాలపై జరిగిన అధ్యయనంలో.. మృతుల్లో 60, ఆపైన వయస్కులే ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మృతుల సగటు వయస్సు 20 ఏండ్లు తక్కువగా ఉంది.
ఇటలీ తదితర పాశ్చాత్య దేశాల్లో కూడా మృతుల సగటు వయస్సు 70 నుంచి 80 మధ్య ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ రోగులు, మృతుల వయో పరిమితిని విశ్లేషించగా, 80 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు 26.4 శాతం ఉన్నారు. భారత్లో పాజిటివ్ రోగులు, మృతుల్లో 60, ఆ పై వయస్కులు 8.9 శాతం మంది ఉన్నారు. ఈ నెల 6 నాటికి చోటుచేసుకున్న 109 మరణాల్లో 69 మంది 60 ఏండ్లు దాటిన వారుండటం గమనార్హం.
109 మంది మృతుల్లో..
- 56 శాతం మందికి మధుమేహం ఉండగా, 47 శాతం మందికి రక్తపోటు ఉంది.
- ఈ రెండూ ఉన్నవారు 86 మంది ఉన్నారు.
- ప్రతి ఐదుగురిలో ఒకరు ఆస్తమా లేదా శాస్వకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.
- 16 శాతం మందికి హృద్రోగ సమస్యలు ఉన్నాయి.
- మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలున్నవారు చాలా తక్కువ