మఠంపల్లి మండలంలో నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడికి కరోనా పాజిటివ్

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి సమీపంలోని నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ బైసన్ బోర్డ్స్ డివిజన్ లో పనిచేస్తున్న కార్మికుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మట్టపల్లి పంచాయతీ పరిధి ఉలిక్కిపడింది. కార్మికుడు గుండె సంబంధిత వ్యాధితో కొద్దిరోజులుగా గుంటూరులో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 9న గుండెనొప్పితో బాధపడుతుండటంతో నాగర్జున సిమెంట్ పరిశ్రమకు చెందిన అంబులెన్స్ లో ఆయన్ను గుంటూరుకు తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు నిరాకరించడంతో ప్రభుత్వ ఆసుప్రతికి వెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించడంతో అతడికి పరీక్షల్లో అతడికి వైరస్ సోకినట్లు తేలింది. ఇక్కడి ఐసోలేషన్ కేంద్రంలోనే అతడికి చికిత్స అందిస్తున్నారు. అయితే అతడు ఎవరిని కాంటాక్టు కావడంతో వైరస్ అంటుకుందని అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల అతను గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమలకు హాజరైనట్లు అధికారుల విచారణలో భయటపడింది. అక్కడ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటే వారినుంచి ఇతడికి వైరస్ సోకినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సదరు వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు, కాలనీ వాసులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ క్వారంటైన్ కు తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అంతేగాకుండా అతడు నివాసం ఉన్న ప్రాంతం నుంచి మూడు కిలోమీటర్ల మేరకు ఇంటింటికీ వెళ్లి అందరి ఆరోగ్య రిపోర్టులు తయారు చేసే పనిలో వైద్య ఆరోగ్య శాఖ నిమగ్నమైంది. సిమెంట్ పరిశ్రమ కార్మికుడికి వైరస్ రావడంతో మట్టపల్లి వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ప్రాంతాన్ని అధికారులు అలర్ట్ చేశారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని సూచించారు.
అలాగే జిల్లా కలెక్టర్ వినయ్ కృష్టారెడ్డి అధికారులను అప్రమత్తం చేయడంతో కోదాడ ఆర్డీవో కిషోర్ కుమార్, డీఎస్పీ అనిశెట్టి రఘు సోమవారం మట్టపల్లి పంచాయతీకి చేరుకుని విచారించారు. మంగళవారం పూర్తిస్థాయిలో సర్వేచేసి బాధితుడు ఎవరెవరిని కలిశారు. తదితర వివరాలు సేకరిస్తామన్నారు. బాధితుడితో పాటు అంబులెన్స్ లో వెళ్లిన వారినీ పరిక్షిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని సత్తెనపల్లికి చెందిన బాధితుడు లాక్ డౌన్ ప్రకటించాక దాచేపల్లిలో బంధువుల అంత్యక్రియలకు వెళ్లివచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం పదిమందిని జిల్లా క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తున్నట్లు వైద్యాధికారి చెప్పారు. తహసీల్దార్ వేణుగోపాల్, సీఐ రాఘవరావు, ఎస్సై ప్రసాద్ ఆర్డీవో, డీఎస్పీల వెంట ఉన్నారు.