
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడినవారు వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు, అప్పటికే ఇతర అరోగ్య సమస్యలు లేనివారు త్వరగా కోలుకుంటున్నారని, వారిని పూర్తి పరీక్షించి రెండుమార్లు నెగిటివ్ రిపోర్ట్ వస్తే అన్ని సరిచూసుకుని డిశ్ఛార్జ్ చేస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. వారం రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎలా పెరిగిందో.. రానున్న రోజుల్లో డిశ్ఛార్జ్ అయ్యే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటుందని పేర్కొంటున్నారు. గడిచిన ఐదు రోజుల్లో 73 మంది కొవిడ్ 19 నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు బుధవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 650కి చేరింది.
కొత్తగా ఆరు కేసులు నమోదు కాగా జిహెచ్ఎంసి పరిధిలో 8 మందిని డిశ్ఛార్జ్ చేశారు. 514 మంది ప్రభుత్వం నోటిఫై చేసిన ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 15వ తేదీన వచ్చిన కేసుల్లో ఒకటి జిహెచ్ఎంసి కాగా, మూడు వికారాబాద్‌లో, రెండు మెదక్‌లో నమోదయ్యాయి. మర్కజ్‌కు లింక్ ఉన్నవారికి, వారిద్వారా కుటుంబ సభ్యులకు, సెకండ్ కాంటాక్ట్ వచ్చిన వారికి దాదాపుగా పరీక్షలు పూర్తి కావొస్తున్నాయి. దీంతో కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య మరింతగా తగ్గుతుందని చెబుతున్నారు. ఈ నెల 11వ తేదీన 51 మంది, 12, 14 తేదీల్లో ఏడుగురు చొప్పున కొవిడ్ 19 నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయినట్లు వైద్యారోగ్య శాఖ లెక్కల ద్వారా స్పష్టమౌతోంది. ఇక మొన్నటి వరకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో చూపిన జిహెచ్ఎంసి పరిధిలోని కేసులను, ఇప్పుడు పూర్తిగా జిహెచ్ఎంసిలో చూపారు.