అటవీశాఖ అధికారులపై కలప స్మగ్లర్ల దాడి

 కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల పరిధిలోని వంకమద్ది బీట్ పరిధిలోని పిట్టగూడ గ్రామంలో 11 మంది కలప స్మగ్లర్లు అటవీశాఖ అధికారులు జే సునీల్, వై సుక్రులపై దాడి చేశారు. 11 మంది స్మగ్లర్లపై కేసు నమోదు చేశామని లింగాపూర్ ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు జే సునీల్, వై సుక్రులు అక్రమ కలపను పట్టుకున్నారు.

పంచనమా అనంతరం కలపను లింగాపూర్ ఆటవీ కార్యాలయానికి తరలించేందుకు వారు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో 11 మంది కలప స్మగ్లర్లు అధికారులపై దాడి చేశారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగిందని ఎస్‌ఐ చెప్పారు. దాడి విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని తమను స్మగ్లర్లు బెదిరించారని బాధిత అటవీశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో పిట్టగూడ సర్పంచితో సహా 11 మందిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వెల్లడించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారించి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ పేర్కొన్నారు.