
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గిందనే ఆనందం ఒక్కరోజులోనే ఆవిరైంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 6 కేసులు మాత్రమే నమోదు కావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఇక పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుందనే అంచనాలు 24 గంటలు కూడా గడవకముందే తలకిందులయ్యాయి. గురువారం ఏకంగా 50 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 700కి చేరుకుంది. గురువారం మొత్తం 800 మంది నమూనాలను పరీక్షించగా, 50 పాజిటివ్ కేసులు వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. నమోదైన కేసుల్లో అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 18 మంది మరణించారు. ఇక గురువారం 68 మంది డిశ్చార్జి కావడంతో, కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లినవారి సంఖ్య 186కి చేరింది.
13 జిల్లాల్లో 159 కంటైన్మెంట్ ప్రాంతాలువైరస్ అధికంగా ప్రబలుతున్న ప్రాంతాలను ప్రభుత్వం కంటైన్మెంట్ ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 28 జిల్లాల్లో వైరస్ వ్యాప్తి చెందగా, గురువారం నాటికి 13 జిల్లాల్లో 159 కంటైన్మెంట్ ప్రాంతాలను సర్కారు ఏర్పాటు చేసింది. ఇందులో తాజాగా 99,257 ఇళ్లకు వెళ్లి, 3,97,028 మందిని వైద్య బృందాలు కలిసి వారి వివరాలు సేకరించాయి. కరోనా పాజిటివ్ లక్షణాలు ఏవైనా ఉన్నాయా? మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారి సెకండరీ కాంటాక్ట్‌లను ట్రేస్ చేసి పరీక్షలు చేస్తున్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఎవరి పరిస్థితివిషమంగా లేదని, ముగ్గురు వెంటిలేటర్‌పై ఉన్నారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు.. వారితో కాంటాక్ట్ అయినవారు పరీక్షలకు ముందుకు రావాలని కోరారు.