
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి (35)కి కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయినట్టు తెలియడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పాతబస్తీలోని యాకుత్‌పురాకు చెందిన వ్యక్తి గాంధీ మెడికల్ కాలేజీలోని ఎలక్ట్రానిక్ లైబ్రరీలో రెగ్యులర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ)గా విధులు నిర్వహిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతుండటంతో రెండు రోజుల క్రితం అతడి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. గురువారం రాత్రి అందిన నివేదికలో అతడికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వెంటనే సదరు బాధితుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. నమూనాలు ఇచ్చిన తర్వాత రెండు రోజులు అతడు విధులకు హాజరు కావడంతో గాంధీ ఆస్పత్రిలోని వైద్యులు, వైద్య విద్యార్థులు, ఇతర సిబ్బంది భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. అందరితోనూ అతడు కలివిడిగా ఉంటాడని తెలిసింది. బుధవారం గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ పేషీల వద్ద అతడు తిరిగినట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆయా పేషీలలోని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కాగా, గాంధీ మెడికల్ కాలేజీ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని ధ్రువీకరించడానికి సంబంధిత అధికారులు అందుబాటులో లేరు.